calender_icon.png 2 August, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళాశక్తి క్యాంటీన్ మూత

01-08-2025 12:38:12 AM

ఆశించిన విధంగా నడవడంలేదంటున్న  నిర్వాహకులు

మహబూబాబాద్, జూలై 31 (విజయ క్రాంతి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా ‘మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో గత డిసెంబర్ నెలలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ ఆశించిన విధంగా నడవడంలేదని నిర్వాహకులు మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, అత్యధికంగా జనం సంచరించే ప్రదేశాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన మౌలిక వసతులను ఆయా ప్రభుత్వ శాఖలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ఈ మేరకు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ కోసం అవసరమైన వసతి సమకూర్చింది. గతంలో గేట్ ఎంట్రీ పాసులు ఇచ్చే గదిని ఉచితంగా మహిళా సంఘం నిర్వాహకులకు మహిళా శక్తి కాంటీన్ కోసం అప్పగించారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో క్యాంటీన్ ఏర్పాటు కోసం అవసరమైన ఇతర సౌకర్యాలు, మోడీ సరుకులు, వస్తు సామాగ్రి కోసం 3.50 లక్షల రుణాన్ని ఇప్పించారు. గత ఏడాది డిసెంబర్ 7న ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు.

మొదట్లో కాస్త ఆశాజనకంగానే క్యాంటీన్ నడిచినప్పటికీ, తరువాత అన్ సీజన్ కావడం వల్ల మార్కెట్కు వ్యవసాయ ఉత్పత్తుల రాకడ తగ్గిపోవడం, దీనికి తోడు పక్కనే ఐదు రూపాయలకు సద్ది మూట పథకంలో భోజనం అందిస్తుండడంతో రైతులు క్యాంటీన్ పట్ల ఆసక్తి చూపకపోవడం వల్ల రోజు రోజుకు గిరాకీ తగ్గిపోయి,

నిర్వహణ భారం పెరగడంతో పాటు ఎలాంటి లాభం రాకపోవడంతో మహిళా సంఘం సభ్యులు చేసేదేమీ లేక నెల రోజుల క్రితం క్యాంటీన్ మూసేశారు. రోజురోజుకు ఆర్థిక భారం పెరిగిపోయి క్యాంటీన్ ఏర్పాటు కోసం తెచ్చిన అప్పు కిస్తీలు తీర్చే పరిస్థితి కూడా లేకుండా పోవడంతో ప్రస్తుతం మహిళా సంఘం సభ్యులు కేవలం వడ్డీ చెల్లిస్తున్నారు.

రెండు రోజుల్లో తెరిపిస్తాం

మార్కెట్లో ఏర్పాటుచేసిన మహిళా శక్తి క్యాంటీన్ అన్ సీజన్ కావడంతో గిరాకీ తగ్గిందని, దీనికి తోడు క్యాంటీన్ పక్కనే సద్ది మూట కార్యక్రమంలో ఐదు రూపాయలకే భోజనం అందించ డం వల్ల రైతులు క్యాంటీన్ వైపు రావ డం లేదని, దీనితో నిర్వాహకులకు క్యాంటీన్ నిర్వహణ భారంగా మారింది. వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి ‘మాస్టర్’ ఎక్కువ వేతనం భారంగా మారింది.

దీనితో నిర్వాహకులు క్యాంటీన్ నిర్వహించలేకపోతున్నారు. తక్కువ వేతనంతో టీ, టిఫిన్ తయారుచేసి పెట్టడానికి కొత్తగా మాస్టర్‌ను మాట్లాడాం. ఒకటి రెండు రోజుల్లో మూతపడ్డ మహిళా శక్తి క్యాం టీన్‌ను మళ్లీ తెరిపిస్తాం. ఈ విషయంపై మార్కె ట్ చైర్మన్ గంట సంజీవరెడ్డితో ఇప్పటికే మాట్లాడటం జరిగింది. క్యాంటీన్ తెరవడానికి మహిళా సంఘం సభ్యులకు తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.

 రాజీరు, ఏపీఎం, కేసముద్రం మండల మహిళా సమాఖ్య