calender_icon.png 1 July, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరివాడు రామచంద్రుడు

01-07-2025 01:26:54 AM

  1. ఉస్మానియా విద్యార్థి నాయకుడి నుంచి బీజేపీ అధ్యక్షుడిగా కిరీటం
  2. రాడికల్స్‌ను ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపీ జెండా ఎగరేసిన నేత
  3. ఏబీవీపీ నేతగా పోరాడి పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలు  
  4. అధిష్ఠానం అండదండలతో తెలంగాణ బీజేపీ చీఫ్‌గా అవకాశం

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ఉస్మానియా వర్శిటీలో ఉద్యమాలు కొత్తకావు. తెలంగాణ ఉద్యమానికే కాదు.. విద్యార్థి సంఘాల పోరాటాలకు వర్సిటీ పుట్టినిల్లు. ఈ తరం వారికి విద్యార్థి సంఘాల పోరాటాలంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రెండు దశాబ్దల క్రితం వరకు విద్యార్థి సంఘాల పోరాటాలు, విద్యార్థి సంఘం ఎన్నికలు.. ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఉ త్కంఠగా సాగేవి.

ముఖ్యంగా ఉస్మానియా లో విద్యార్థి సంఘాల ప్రభావం అంతాఇం తా కాదు. నాడు విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే ఆ తర్వాత రాజకీ యాల్లో క్రియాశీలపాత్ర పోషిస్తూ గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రు లుగా, రాష్ర్ట మంత్రులుగా అనేక పదవులు చేపట్టిన చరిత్ర ఉస్మానియాకు ఉంది. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థి సంఘం నేతఅయిన రాంచందర్‌రావుకు కూడా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్ర అధ్యక్ష అవకాశం దక్కింది.

మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది రాంచందర్ రావు పేరును జాతీయ నాయకత్వం ఖరారు చేయడంతో సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనొక్కరే నామినేషన్ దాఖలు చేసిన తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియామకం లాంఛనమే. 

పబ్లిక్ వకీల్..

1986లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన రాంచందర్‌రావు.. జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలందించారు. 2012లో హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్‌గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ట్రిబ్యూనల్స్‌లలో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు.

ఇక బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ప్రజా సమస్యలపై, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయపోరాటం చేసి, జైలు నుంచి బయటకు తీసుకురావడంలో ప్రధానపాత్ర పోషించారు. 

రాజకీయ ప్రస్థానం..

1986లో బీజేపీలో చేరి హైదరాబాద్‌లోని రవీంద్రనగర్ డివిజన్ నుంచి కార్పొరే టర్‌గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ర్ట కార్యదర్శిగా (1980-82), నగర ఉపాధ్యక్షుడిగా (1986-90) సేవలందించారు. బీజేపీ రాష్ర్ట లీగల్ సెల్‌లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్ (1999-2003), కన్వీనర్ (2003-06)గా బాధ్యతలు నిర్వర్తించారు.

జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్ (2006-10), బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధిగా (2007- 09), రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా (2009- 12), ముఖ్య అధికార ప్రతినిధిగా (2012- 15) పనిచేశారు. 2015లో హైదరాబాద్-రంగారెడి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్‌గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగానూ సేవలందించారు.

అందరివాడు.. పార్టీ విధేయుడు

రాంచందర్‌రావుకు రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. పార్టీలో, బయట కలుపుగోలు మనిషిగా ఆయన్ను అందరూ అభి మానిస్తారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుం డా అందరితో నవ్వుతూ సఖ్యతగా మాట్లాడే నాయకుడు. పాత, కొత్త తరం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం. రాంచందర్‌రావు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులుంటాయని, టెన్షన్ మటుమాయమవుతుందని పార్టీ నేతలంతా సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు.

విధేయతకు కేరాఫ్ అడ్రస్‌గా.. హైకమాండ్ ఒక పని అప్పగించిందంటే అది పూర్తి చేసేదాకా కష్టపడతా రని ఆయన సన్నిహితులు వ్యాఖ్యాని స్తున్నా రు. ఇన్ని సుగుణాలు, రాజకీయ నేప థ్యం ఉన్నందునే పార్టీ జాతీయ నాయకత్వం ఆయనకు రాష్ర్ట పగ్గాలు అప్పగించింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పార్టీలోని సీనియర్ నేతలంతా ఆయనకు సంపూర్ణంగా మద్దతు పలికారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

నక్సలైట్లకు ఎదురొడ్డి..

ఎన్ రాంచందర్ రావు అంటే న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. కానీ విద్యార్థి రాజకీయాల్లోనే ఆయనో సంచలనం. ఉస్మానియా యూనివర్శిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రాంచందర్‌రావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. 1977 నుంచి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు.

ఆయన తండ్రి ప్రొఫెసర్. ఉస్మానియా వర్శిటీ పరిధిలోనే నివాసం ఉండే వారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా దూరంగా ఉండేవారు. కానీ రాంచందర్‌రావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాకుండా రాడికల్ స్టూడెంట్స్‌తో నేరుగా తలపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. 1975 నుంచి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డాగా మారిన సమయంలో వారికి ఎదురొడ్డి పోరాటం చేశారు.

ఉస్మానియా లైబ్రరీలో రాంచందర్‌రావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలైట్లు అక్కడికి వచ్చి, తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్లు, చేతులు విరగ్గొట్టి వెళ్లారు. దాదాపు రెండు నెలలపాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రాడికల్స్‌కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు.

విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రాంచందర్‌రావు అటు రాడికల్స్ దాడులతోపాటు ఇటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఉద్యమాలు చేస్తూనే మరోవైపు ఎంఏ (1980-82), ఎల్‌ఎల్‌బీ (1982-85) పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడిగా (1977-85), నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.