తుది విడతకు సర్వం సిద్ధం!
- నేడే మూడో విడత పంచాయతీ ఎన్నికలు..ఫలితాలు
ఉమ్మడి జిల్లాలో 518 సర్పంచ్, 3,939 వార్డులకు ఎన్నికలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
గామాల్లో విచ్చలవిడిగా మద్యం, నగదు పంపిణీ
సంగారెడ్డి, డిసెంబర్ 16(విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 17న చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మొదటి, రెండవ విడతల్లో ఎన్నికలు చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మూడో విడత కూడా ఎన్నికలను ప్రశాంతంగా ముగించాలని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 518 సర్పంచులకు, 3,939 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో మూడో విడతలో నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, మనూర్, సిర్గాపూర్, నాగల్గిద్ద, నిజాంపేట, న్యాల్కల్ మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం 234 పంచాయతీలకు గాను 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 207 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నిక జరగనుంది.




