06-12-2024 02:58:44 AM
* యూపీఎస్సీతో సమానంగా టీజీపీఎస్సీ పనిచేస్తోంది
* టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బుర్రా వెంకటేశం
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని, యూపీఎస్సీతో సమానంగా టీజీపీఎస్సీ పనిచేస్తుందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. కమిషన్‌పై పూర్తి విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. గురువారం ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఈ పదవిలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.
తాను కూడా ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే సమయంలో నమ్మకంతో చదివి ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. ప్రణాళికబద్ధంగా ప్రతి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షలు ప్రశాంతంగా, విశ్వాసభరితంగా రాసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరీక్షలు వాయిదా పడ్తాయి, ఎప్పుడో అవుతాయి అనే కన్ఫ్యూజ్‌ను అభ్యర్థులు తీసేయాలని కోరారు. పరిచయం ఉన్న వాళ్లను నమ్మడం మానేసి.. మీపై మీకు నమ్మకంతో చదువుకోవాలని సూచించారు. భయంతో పరీక్షలు రాయడం మానేసి ధైర్యంగా రాయాలని సూచించారు.
టీజీపీఎస్సీ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి
అభ్యర్థులు, నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు మూడున్నరేళ్ల సర్వీస్‌ను వదులుకుని టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్షలు రాయాలని కోరారు. ఎవరైనా టీజీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, తెలిసినవా ళ్లు ఉన్నారని అంటే వెంటనే టీజీపీఎసీ విజిలెన్స్ నం.9966700339కు లేదా ఈమెయిల్ vigilance@ tspsc.gov.in కు, పోలీసులకు సైతం ఫిర్యాదు చేయాలని సూచించారు. టీజీపీఎస్సీకి స్వయం ప్రతిపత్తి ఉందని, ఎవరికీ భయపడకుండా పనిచేస్తామన్నారు. తప్పులు ఎవరూ చేసినా ఉపేక్షిం చబోమని, ఎవరైనా ఉంటే వాళ్లు తప్పుకోవాలని హెచ్చరించారు.