calender_icon.png 31 August, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్కారీశాఖ దూకుడు

31-08-2025 01:24:52 AM

  1. గంజాయి, డ్రగ్స్, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్..కల్తీ మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా 
  2. ఆయా కేసుల్లో నిందితులకు జైలుశిక్షలు  
  3. రెండేళ్లలోనే 64 మందికి జైలుకి
  4. సంగారెడ్డి, మెదక్  జిల్లాల్లోనే అత్యధికం

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): గంజాయి, డ్రగ్స్, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్, కల్తీ మద్యం అమ్మకాలపై అబ్కారీ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఆయా సందర్భాల్లో నిందితులపై కేసులు నమోదు చేస్తూ, వారికి శిక్షలు పడేలా చూస్తోంది. రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు 64 మంది జైళ్లకు వెళ్లారు. ఆయా వ్యవహారాలపై కేసుల నమోదు చేసే అధికారం లాండ్ ఆర్డర్, ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్) పోలీసులతో పాటు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా తయారీ అమ్మకాలు, కల్తీ మద్యం తయారీకి సంబంధించిన వాటిపై కేసులు నమోదు చేసే అధికారం అబ్కారీ శాఖకు ఉంది.

ఈ రెండు శాఖలు నమోదు చేసే కేసుల పంచానామా, చార్జీషీట్, సాక్షుల వాగ్మూలాలు, కేసుల్లో శిక్షలు పడటానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ పోలీసులు పెట్టిన కేసులకే శిక్షలు పడేవి. కానీ, ఈ మధ్యకాలంలో ఎక్సైజ్ శాఖ పరిధిలో నమోదవుతున్న కేసుల్లో కూడా నిందితులకు పదేళ్లు, ఐదేళ్లు జైలు శిక్షలతో పాటు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కోర్టు తీర్పుల్లో జరిమానాలు కూడా విధిస్తున్నారు. దీంతో తమ కష్టానికి ఫలితం దక్కుతుందనే ఆత్మస్థుర్యైం అబ్కారీ శాఖ అధికారుల్లో పెరుగుతోంది.

గతంలో ఎక్సైజ్ శాఖ మద్యం, కల్లు అమ్మకాల్లో కల్తీని అరికట్టడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టేది. కానీ,  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గంజాయ్, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. దీంతో పోలీసులతోపాటు ఎక్సుజ్ శాఖ అధికారులు గంజాయి, డ్రగ్స్‌ను పట్టుకోవడంపై దృష్టి సారించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం 2021లో ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెస్) అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఎన్‌డీపీఎస్ చట్టంపై అవగాహన కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ కమిషనర్ హరికిరణ్, ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి టీజీ న్యాబ్ పర్యవేక్షణలో పోలీస్ అకాడమీలో ఎక్సుజ్‌శాఖకు చెందిన 1,190 మందికి కానిస్టేబుల్ నుంచి అన్ని స్థాయి అధికారుల వరకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.

ఎన్‌పీడీఎస్ శిక్షణతోపాటు చార్జీషీట్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంచానామా రాసే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను పంచులగా చేర్చడం వంటి వాటిపై ఎక్సుజ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న ఎక్సుజ్ యంత్రాంగం గంజాయి, డ్రగ్స్, ఆల్ఫోజోలం లాంటి మత్తు పదార్థాల కేసులో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటంతో ఎక్సుజ్ శాఖ నమోదు చేస్తున కేసుల్లో శిక్షలు పడుతున్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.

ఎన్‌సీఆర్ (నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో) కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం దేశంలో ఎన్‌పీడీఎస్ చట్టం ద్వారా అత్యధికంగా కేరళలో 22,619 కేసులు, మహారాష్ర్టలో 13,830, పంజాబ్‌లో 12,442, ఉత్తరప్రదేశ్‌లో 11,541, తమిళనాడులో 10,385, ఏపీలో 1391 తర్వాత 1,279 కేసులతో తెలంగాణ తర్వాతి స్థానంలో ఉంది. కేసుల నమోదుతో పాటు శిక్షలు కూడా అదే స్థాయిలో పడుతున్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. పంజాబ్‌లో 132, ఉత్తరప్రదేశ్‌లో 2,925, ఏపీలో 325, తెలంగాణలో 365, మధ్యప్రదేశ్‌లో 2,689, హర్యానాలో 1,189 మందికి శిక్షలు పడినట్టు రికార్డులు చెపుతున్నాయి.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రెండు, మూడేళ్లు పాలసీల మార్పులకే సమయం పట్టింది. మరో రెండేళ్లు కరోనాతో అన్ని రకాల కేసులు స్తంభించిపోయాయి. ఇక 2023 సంవత్సరం నుంచి ఎక్సుజ్ శాఖ నమోదు చేసిన కేసుల్లో శిక్షలు పడటం ప్రారంభమైంది. 2023లో తెలంగాణలో ఎన్‌పీడీఎస్‌లో 16 కేసులు, 2024లో 11 కేసులు, 2025లో 12 కేసుల్లో నిందితులకు శిక్షలుపడ్డాయి. తెలంగాణలోని వివిధ కేసుల్లో 64 మంది నిందితులకు శిక్షలుపడ్డాయి. తెలంగాణలోని 33 జిల్లాలో ఎక్కువగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో శిక్షలుపడ్డాయి. ఈ రెండు జిల్లాల్లోనే 36 కేసుల్లో శిక్షలు పడటం గమనార్హం. 

నిబంధనలు పాటించడం వల్లే..

నాతో పాటు కింది స్థాయి యంత్రాంగం కేసు నమోదులో నిబంధనలు పాటించాలని ఆదేశించడం ఒకటైతే.. కేసు నమోదు సమయంలో నిర్వహించే పంచనామాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇన్‌వాల్వ్ చేయడం ప్రధానం అంశం.   ఇదే తీరును అన్ని స్టేషన్లలో పాటించడం వల్ల ఎక్కువ కేసుల్లో శిక్షలు పడుతున్నాయి.

శిక్షలు పడిన ప్రతీ కేసులో ఐదేళ్లు, పదేళ్ల శిక్షలతో పాటు రూ.50 వేల నంచి రూ.లక్ష వరకు జరిమానాలు పడ్డాయి. 2010లో సరూర్‌నగర్ ఎక్సుజ్ స్టేషన్ పరిధిలో 600 కేజీల గంజాయిని పట్టుకున్న కేసులో 2013లో వచ్చిన తీర్పులో ఒకరికి 20 ఏళ్లు, మరో 7గురికి పదేళ్ల వరకు శిక్షలు పడటం వల్ల  ఎక్సుజ్ శాఖ సిబ్బందికి స్ఫూర్తినిచ్చినట్లయింది. ఇదే తీరులో మిగతా జిల్లాలోని అన్ని స్టేషన్లలో శిక్షలు పడేలా కేసుల్లో చార్జీషీట్ దాఖలు చేస్తున్నారు.

అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ ఎక్సుజ్‌శాఖ పనితీరుకు నిదర్శనం..

ఎక్సుజ్ శాఖలో నమోదవుతున్న కేసుల్లో యేటా నిందితులకు శిక్షలు పడుతుండటం శుభ పరిణామం. నమోదు చేసిన కేసుల్లో శిక్షలు పడుతుంటే ఎక్సుజ్ సిబ్బందికి తాముపడిన కష్టానికి ఫలితం దక్కిందని భావిస్తారు. శిక్షలు ప్రతియేటా పెరుగుతుండటం ఎక్సుజ్‌శాఖ పనితీరు నిదర్శనం.

 షా నవాజ్ ఖాసిం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్