31-08-2025 01:04:07 AM
గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా రైతులను పట్టిపీడిస్తున్న యూరియా కొరతపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీవ్ర నిరసనలకు దిగింది. శనివారం అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఖాళీ యూరియా బస్తాలతో వినూత్న నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు, వ్యవసాయ కమిషనరేట్ ఎదుట ధర్నా చేసి, సచివాలయం గేట్ వద్ద నిరసన తెలిపారు.
అసెం బ్లీకి వెళ్లే ముందు బీఆర్‌ఎస్ నాయకులు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖాళీ యూరియా బస్తాలను చేతపట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే యూరి యా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ముందుగా అసెంబ్లీ నుంచి ప్లకా ర్డులు పట్టుకొని వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఎరువుల కొరత తీర్చాలంటూ వ్యవసాయ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం అక్కడే ధర్నాకు దిగారు. ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా పలువురు నేతలు మెరుపు వేగంతో సచివాలయం గేట్ వద్దకు చేరుకుని బైఠాయించా రు. హరీశ్‌రావు పరుగెత్తుకుంటూ వచ్చి నిరసనలో పాల్గొనడం విశేషం. ఇక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంజయ్, మధుసూదనాచారి నాయకులు నిరసనలో పాల్గొన్నారు.
15 రోజులు అసెంబ్లీ నిర్వహించాలి: కేటీఆర్
మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలైన వ్యవసాయం, ఎరువుల కొరత, పంట నష్టాలు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై చర్చించాలని కోరారు. వ్యవసాయం, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆరు గ్యారెంటీలు సహా ఏ అంశంపై చర్చ పెట్టినా సరైన సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ సవాల్ విసిరారు.
“రైతులు పండుగ రోజుల్లో కూడా ఎరువుల కోసం లైన్లలో నిలబడాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలనలోనే వచ్చింది. పదేళ్ల మా పాలనలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. రాష్ర్టంలో ఇప్పటివరకు 600 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 75 లక్షల మంది రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులకు కాంగ్రెస్ చేసిన మోసంపై అసెంబ్లీలో చర్చ జరగాలి” అని పేర్కొన్నారు.