31-08-2025 12:54:28 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి ): కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేపట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పటి ష్ఠ వ్యూహాన్ని రచిస్తోంది. బీఆర్‌ఎస్ దీటుగా ఎదుర్కొవడం, అసెంబ్లీలో లేవనెత్తాల్సిన ప్రధాన అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించింది. ఈ మేరకు శనివారం జలసౌధలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇరిగేషన్ శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ఎమ్మెల్యేలకు వివరిం చినట్టు సమాచారం. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ను కట్టడి చేసేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్ నివేదికపై రాష్ర్ట ప్రభుత్వం చేసే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎ మ్మెల్యేలకు ముందస్తుగా పీపీటీ ద్వారా పూ ర్తి సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీలోనూ పీపీటీ..
కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని సర్కార్ ఇప్పటికే బహిర్గతం చేసింది. అయితే కాళేశ్వరం కమిషన్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా నివేదికపై పీపీటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనికి సం బంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్ర మాలను, అవినీతిని ప్రజల ముందుంచడం ద్వారా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోం ది. ఈ క్రమంలో అసెంబ్లీ ద్వారా కాళేశ్వరం అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ 650కి పైగా పేజీల నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అనేక అవకతవకలు, నాణ్యతా లోపాలు, నిధుల దుర్విని యోగం వంటి అంశాలను కాంగ్రెస్ ప్రభు త్వం బయటపెట్టనుంది. ఈ నివేదిక ఆధారంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ నాయకులను దోషిగా నిలబెట్టడం ద్వారా ప్రజల్లో తమ విశ్వసనీయతను పెం చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోం ది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రా జెక్టు అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృం దం (సిట్) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీని ద్వారా నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమం చేయాలని యో చిస్తోంది. అంతేకాకుండా, బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగా సీబీఐ విచారణకు కూడా వెనుకాడేది లేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే అసెంబ్లీలో ఘోష్ నివేదికపై చర్చ జరగడమే ప్రధానమని, తదుపరి చర్యలకు అది పునాది అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. మేడిగడ్డ బరాజ్ కుం గిపోవడం, ఎన్డీఎస్‌ఏ సూచనలను విస్మరించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ విషయాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని నిరూపించే ప్రయత్నం చేయనుంది.