31-08-2025 12:42:49 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి, అక్రమా లు, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఎట్టకేలకు రాష్ట్ర శాసనసభకు చేరనుంది. సుమారు 16 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత కాళేశ్వరం కమిషన్ తమ నివేది కను ప్రభుత్వానికి అందించింది.
కమిషన్ ఇచ్చిన నివేదికను సభలో చర్చించి.. కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి చట్టప్రకారం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేక సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంత్రివర్గం నివేదికను ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీలో చర్చ ద్వారా ప్రాజె క్టులో గత పాలకులు చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
ఆదివారం ఉదయం 9 గంటలకు కమిషన్ ఇచ్చిన పూర్తి నివేదికను సభ ముందు ఉంచనుంది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగే అవకాశం స్పష్టం గా ఉన్నాయి. అయితే బీఆర్‌ఎస్ మాత్రం బా య్‌కాట్ చేయడానికి నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇదే జరిగితే.. కమిషన్ నివేదికపై తమ సభ్యులకే తాము వివరించిన చందంగా సభ మారనుంది.
665 పేజీల నివేదిక
కాళేశ్వరంపై ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘో ష్ కమిషన్.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ఇంజనీర్లు, ఐఏఎస్‌లతోపాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ తదితర రాజకీయ నాయకులను విచా రించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. మొత్తం 115 సాక్షులను కమిషన్ విచారించింది.
సుమారు 15 నెలలపాటు సుదీర్ఘకాలం విచారించి 665 పేజీల నివేదికను ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో అందించింది. ఆదివారం శాసనసభలో ఉదయం 9 గంటలకు కమిషన్ ఇచ్చిన పూర్తిస్థాయి నివేదికను (665 పేజీలు) ప్రవేశ పెట్టనుంది. దీనితో పూర్తిస్థాయి నివేదికను విడుదల చేయాలనే బీఆర్‌ఎస్ నేతలు గడిచినన కొద్ది రోజులుగా చేస్తున్న డిమాండ్‌కు తెరపడనుంది.
కొద్ది మందికే ప్రతులు.. మిగతా వారికి పెన్‌డ్రైవ్‌లు..
ఘోష్ కమిషన్ ఇచ్చిన పూర్తిస్థాయి నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టగానే.. దీనికి సంబంధించిన పూర్తి ప్రతులను మంత్రులు, ఎల్పీ నాయకులకు మాత్రమే అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సభలోని మిగతా సభ్యులకు ఈ నివేదికలను సాఫ్ట్ కాపీల రూపంలో పెన్‌డ్రైవ్‌లలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
అంటే ప్రధానంగా మంత్రులు, వారితోపాటు ఎల్పీ లీడర్ల వద్ద మాత్రమే అప్పటికప్పుడు అసలు నివేదికలో ఏం ఉందో చూసుకునే వీలుంటుంది. మిగతా సభ్యులు సభ బయటకు వెళ్లి తమ ల్యాప్ ట్యాపుల్లోగానీ, కంప్యూటర్లలోగానీ నివేదికలోని అంశాలను చూసుకోవాల్సి ఉంటుందని సమాచారం.
నివేదికపైనే ప్రధానంగా చర్చ
సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు నివేదిక అందించి తర్వాత చర్చిం చే ప్రభుత్వ ఆలోచన ఆసక్తికరంగా మారింది. అయితే చర్చ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని నిర్మాణ లోపాలు, అవినీతి, కమిషన్ నివేదికపై అన్ని పార్టీల ఎమ్మెల్యే నుంచి అభిప్రాయం తీసుకోనున్నారని సమాచారం.
వ్యూహాత్మకంగా అధికార పక్షం..
వాస్తవాలను పరిశీలిస్తే.. బీఆర్‌ఎస్ నేతలతో పోలిస్తే.. కాళేశ్వరంపై అధికార పక్షం నేతలకు కాస్త అవగాహన తక్కువే. పైగా సాంకేతికంగా కూడా లోతుగా మాట్లాడే స్థాయిలోఅవగాహన ఉన్న నేతలు ఒకరిద్దరి కంటే ఎక్కువ లేర నేదికూడా నిజం. కానీ బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఈ అంశంలో కొట్టిన పిండి. అందుకే కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోం ది. ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో కమిషన్ నివేదిక ప్రతులను అందరికీ అందిస్తే.. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యుల విషయం పక్కనపెట్టి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలకు మరింతగా అవకాశం ఇచ్చినట్టవుతుందనే ఆలోచనలో అధికా రపక్షం నేతలు ఉన్నట్టు సమాచారం. దీనివల్ల సబ్జెక్టుపై చర్చలో ప్రతిపక్షం జోరు పెంచే అవకాశం ఉన్నట్టుగా భావించిన అధికార పక్షం నేతలు..
ముఖ్యమైనవారికే ప్రతులను ఇచ్చి.. మిగతావారికందరికీ పెన్‌డ్రైవ్‌లను ఇచ్చేలా ప్లాన్ చేసినట్టుగా మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే ముఖ్యమైన వారందరికీ ప్రతులు ఇచ్చి.. మిగతా సభ్యులకు పెన్‌డ్రైవ్‌లు ఇస్తే.. వారు కంప్యూటర్లలో సబ్జెక్టును చదువుకుని వచ్చేసరికి ప్రతిపక్షం దుమ్ముదు లిపేయాలనే వ్యూహంతో అధికారపక్షం ముం దుకు వెళుతోంది.
కేటీఆర్, హరీశ్‌తో వరుస భేటీలు
కాళేశ్వరం విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరైనప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా హరీశ్‌రావుతో పలుమార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం నివేదికపై ఎలా ముందుకెళ్లాలో సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. అయితే కాళేశ్వరం కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసిన తర్వాత హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లారు.
నివే దిక ద్వారా వచ్చే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం. ఆ తర్వాత కమిషన్ నివేదికలను తమకూ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును కలిసి కేసీఆర్, హరీశ్‌రావు పేరిట వేర్వేరు వినతిపత్రాలను అందిం చారు. కానీ ప్రభుత్వం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రస్తుతం అసెంబ్లీలోనే చర్చించనున్నది.
ఈ నేపథ్యంలో నివేదిక ద్వారా ప్రభుత్వం చేసే ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ కూడా అయినట్టు సమాచారం. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది.
బాయ్‌కాట్ ఆలోచనలో బీఆర్‌ఎస్
అధికారపక్షం వ్యూహానికి చెక్‌పెట్టేందుకు బీఆర్‌ఎస్ నేతలు ప్రతి వ్యూహం పన్నినటు సమాచారం. కమిషన్ పూర్తి నివేదిక కాపీలను అందిరికీ ఇవ్వలేదనే సాకుతో లేదా గందరగోళం సృష్టించి సభ నుంచి బాయ్‌కాట్ చేయాలనే ఆలోచనతో బీఆర్‌ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. అలా కాకుండా.. అధికార కాంగ్రెస్ పార్టీ.. బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేసే అవకాశం మాత్రం లేదని గట్టిగా నమ్ముతోంది.
బాయ్‌కాట్ చేస్తే కేవలం సాంకేతికంగానే సభలో ప్రవేశపెట్టినట్టవుతుందని, కానీ కాం గ్రెస్ సభ్యుల ప్రసంగాలను వినాల్సిన అవసరం ఉండదని, తద్వారా ప్రజల్లోనూ ఈ కాళేశ్వరంపై సభలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను డైవర్ట్ చేసినట్టవుతుందని బీఆర్‌ఎస్ ఆలోచన. దీనివల్ల కాంగ్రెస్ సభ్యులు.. వారి పార్టీ సభ్యులకే కాళేశ్వరంపై చెప్పినట్టవుతుందని, ప్రజల్లో కాంగ్రెస్‌పై కాస్త అసంతృప్తిని కల్పించవచ్చని..
పైగా కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో చేసే అరోపణలకు.. పూర్తిగా సాంకేతికంగా సరైన సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుందనే ఆలోచనలో బీఆర్‌ఎస్ నేతలు ఉన్నట్టుగా రాజకీయ వర్గా ల సమాచారం. మొత్తానికి కమిషన్ నివేదికను ఆదివారం ఉదయం 9 గంటలకు అ సెంబ్లీలో ప్రవేశపెట్టిన తరువాత.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగే చర్చలు, వాదనలు.. వ్యూహాలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.