31-08-2025 01:21:45 AM
బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కా
పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్
తగ్గేదేలె!
నేడు అసెంబ్లీలో ఆర్డినెన్స్‌పై తీర్మానం
ప్రత్యేక జీవో ద్వారా బీసీ కోటా అమలు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ మేరకు తాము హామీ ఇచ్చినట్లుగా 42శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని.. ఈ మేరకు శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన తెలిపారు.
శనివారం క్యాబినెట్ భేటీ అనంతరం సెక్రటేరియేట్‌లో మంత్రి పొంగులేటితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ ఆమోదం తర్వాత సభలో చేసిన తీర్మానానికి బీజేపీ సహా అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయని ఆయన తెలిపారు. తీర్మానం చేసిన తర్వాత గవర్నర్‌కు, అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపించి 4 నెలలు గడుస్తోందన్నారు.
ఎన్నికలను సెప్టెంబర్ చివరి నాటికి ముగించాలని హైకోర్టు ఆదేశాలున్నాయ ని, న్యాయపరమైన నిర్ణయాలు జరిగి, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 42 శాతం రిజర్వేషన్ల మేరకు ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ తీర్మానించిందన్నారు. 2001 జనాభా ఆధారంగా రిజర్వేష న్లు కల్పించాలని క్యాబినెట్ ఆమోదిం చింద న్నారు.
గత సీఎం కేసీఆర్ వేసిన ఉరితాడు లాంటి చట్టం 2018-పీఆర్ యాక్ట్, 2019- మున్సిపల్ యాక్ట్ 50 శాతం సీలింగ్‌ను రద్దు చేసేందుకు నెలన్నర క్రితం ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ఆదివారం సభలో తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. ఈ దిశగా ప్ర త్యేక జీవో జారీ చేయడానికి ప్రభుత్వం సి ద్ధం అవుతోంది. ఈ క్రమంలో 42 శాతం బీ సీ రిజర్వేషన్‌ను ప్రత్యేక జీవో ద్వారా అమ లు చేయనుంది. అన్ని రాజకీయ పక్షాలు ఈ ఆర్డినెన్స్‌ను స్వాగతించాలని, సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు.
సభలో ప్రొసీ జర్ ప్రకారం అన్ని పక్షాల ఆమోదంతోనే ఆర్డినెన్స్.. బిల్లుగా మారుతుందన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో కచ్చితంగా ఎన్నికలకు వెళ్తామని మంత్రులు పొన్నం, పొంగులేటి స్పష్టం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కో దండరాం, మహమ్మద్ అజారుద్దీన్ పేర్లను క్యాబినెట్ ఆమో దించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రం లో భారీ వర్షాల వల్ల ఏర్పడిన ఆస్తి నష్టంపై చర్చించి నిధులు విడుదల చేస్తామన్నారు.
సెక్షన్ 285(ఏ) సవరణ
పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285 (ఏ) లో సవరణలు చేయాలని కూడా ప్రభు త్వం నిర్ణయించింది. ఈ సవరణతో బీసీ వ ర్గాలకు పంచాయతీ రాజ్ ఎన్నికలలో అధిక రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుంది. ఈ సవరణ ద్వారా, బీసీ వర్గాలు ప్రాతినిధ్యం పెంచుకొని, వారికి మరింత స్థానం, అధిక అవకాశాలు కల్పించడానికి మద్దతు లభిస్తుంది. రాష్ర్ట ప్రభుత్వం 50 శాతం సీలింగ్‌ను సడలించేందుకు చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే నిమిత్తం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనితో, రిజర్వేషన్ల కోటా పరిమితిని నెమ్మదిగా పెంచవచ్చు.
ప్రస్తుతం దేశంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ సీలింగ్‌ను తొలగించడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరిన్ని అవకాశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్డినెన్స్‌కు ఆమోదం లభిం చకపోవడంతో జీవో ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో ద్వారా, కొత్త రిజర్వేషన్ విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. ఈ జీవో అమలు చేయడం ద్వారా బీసీలకు విద్య, ఉద్యోగాలు, పంచాయతీ ఎన్నికలలో మరింత ప్రాతినిధ్యం ఉంటుంది.
త్వరలో ఓటర్ల తుది జాబితా
రిజర్వేషన్లకు సంబంధించిన 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేసి, బీసీలకు 42 శాతం అ మలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయనున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలుకానున్నది. సెప్టెంబర్ 30వ తేదీలో గా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిం దే.
ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ కూడా ఎన్నిక లు నిర్వహించాలని నిర్ణయించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన పంచాయ తీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను వి డుదల చేసింది. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. ఏడాదిన్నరగా పంచాయతీ ఎన్నికలకు ప్రధాన అడ్డంకి మారిన బీసీ రిజర్వేషన్ అంశం కొలిక్కి వచ్చింది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సంచలన నిర్ణయం ద్వారా 50 శాతం రిజర్వేషన్ సీలింగ్‌ను సడలించడాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఈ దిశగా ప్రత్యేక జీవో జారీ చేయడానికి సిద్ధం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను ప్రత్యేక జీవో ద్వారా అమలు చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనున్నది.
ముఖ్యాంశాలు
* వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశం. ఆస్తి నష్టం సహా జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు, రైల్వే లైన్లు, చెరువులు, కుంటలతో పాటు జరిగిన నష్టాన్ని శని, ఆదివారాల్లో అంచనా వేసి, సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి జిల్లాల కలెక్టర్లు పూర్తి నివేదికతో హాజరు కావాలని నిర్ణయం. నష్టాన్ని పరిశీలించిన తర్వాత తాత్కాలిక మరమ్మతుల కోసం వెంటనే నిధులు విడుదల.
* గోశాలల్లో గోవులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ప్రత్యేకంగా గోశాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం. పలుచోట్ల గోవులకు కనీసం మేత కూడా లేక బక్కచిక్కిపోయిన ఉదంతాలున్నాయి. ఈ తరుణంలో బోర్డు ఏర్పాటు వల్ల పరిస్థితిని మెరుగుపరచడం, ఇందుకు సీఎస్‌ఆర్ ద్వారా వివిధ సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందించేలా చర్యలు.
* 2022-23 రబీ సీజన్‌లో బీఆర్‌ఎస్ హయాంలో ధాన్యం సేకరించిన తర్వాత సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల మేర రికవరీ చేయలేదు. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత మిల్లర్ల వద్ద నుంచి ఇందుకు సంబంధించిన డబ్బులను రికవరీకి చర్యలు. మిల్లర్లు ఆ డబ్బులు చెల్లించకుంటే వారిపై పీడీ యాక్టు నమోదు చేసేలా నిర్ణయం.
* ప్రాజెక్టులకు వచ్చే అకాల వరదల సమాచారం క్షణక్షణం తెలుసుకుని వరద నష్టాల నుంచి బయటపడేందుకు గాను నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో చేరేందుకు నిర్ణయం.
* మత్స్య సహకార ఎన్నికల నిర్వహణ బాగా ఆలస్యం అయిన నేపథ్యంలో పర్సన్ ఇన్‌ఛార్జిలుగా మత్స్య సహకార సంఘంలోని సభ్యులను నియమించాలని నిర్ణయం.