31-08-2025 01:11:05 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): టీజీఎస్‌ఆర్టీసీ, టీజీఎస్పీడీసీఎల్, టీజీజెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్టిల్లరీస్ వంటి కార్పొరేషన్లు వాటి ఆదాయం అవే సమకూర్చుకొని, ఉద్యోగులకు వేతనాలు అందిస్తుంటాయి. అయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లో మాత్రం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. పేరుకే కార్పొరేషన్ అయినా వారికి ఆదాయం ఉండదు. వారి జీతభత్యాలు అన్నీ ప్రభుత్వమే ఇస్తుంది. టీవీవీపీ ఉద్యోగులు ఇప్పటికీ సొసైటీ కిందే ఉన్నారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ (010 పద్దు) ద్వారా సకాలంలో వేతనాలు అందుతుండగా..
టీవీవీపీ ఉద్యోగుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. సమయానికి వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. టీవీవీపీ ఉద్యోగులకు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. వైద్యారోగ్యశాఖ పరిధిలో అనేక విభాగాలు ఉండగా.. ప్రధానంగా డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్), డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), టీవీవీపీ పనిచేస్తున్నాయి. టీవీవీపీ వైద్య సేవల్లో మిగతా విభాగాల మాదిరిగానే ఉన్నా ప్రత్యేక కార్పొరేషన్ కావడమే ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.
ఏపీవీవీపీ నుంచి.. టీవీవీపీ వరకు
సమైక్య రాష్ర్టంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987, మార్చి 1న ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్(ఏపీవీవీపీ) ఏర్పాటైంది. రాష్ర్ట విభజన అనంతరం టీవీవీపీగా ఆవిర్భవించింది. టీవీవీపీలో ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధుల ద్వారా ఇది పనిచేస్తోంది. సొంతంగా ఆర్థిక వనరులను సమకూర్చుకుని నిర్వహించుకొనే లక్ష్యంతో ఏర్పాటైన తర్వాత పూర్తిగా ప్రభుత్వమిచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులపైనే ఆధారపడి కొనసాగుతోంది.
వైద్య, ఆరోగ్య సేవల్లో కీలకంగా ఉంటున్నా, నిధులు మాత్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లేదా ప్రజారోగ్య శాఖ ద్వారా అందాల్సి ఉంటోంది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటుతో నేరుగా నిధులను పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు వేతనాలు సహా అన్ని చెల్లింపులకు ప్రతిసారీ ఆర్థికశాఖ ధ్రువీకరించాల్సి ఉంటోంది.
ఒకటో తారీకున వేతనాలేవీ..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తారీకున జీతాలు ఇస్తున్నామని ఘనంగా చెబుతున్న సర్కారు.. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు మాత్రం ఆగస్టు నెల జీతాలను 20వ తేదీన ఇచ్చింది. దీంతో పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు, ఇతర చెల్లింపులు చేయాల్సిన సిబ్బంది ఎంతో ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుగానే ఈ సర్కారు చేస్తోందని ఓ వైద్యాధికారి వాపోయారు. ప్రజలకు వైద్య సేవలు అందించే కీలక విభాగంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో కార్పొరేషన్‌ను రద్దు చేసినప్పుడు తెలంగాణలో ఏం ఇబ్బంది వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. టీవీవీపీలో ఉన్న క్యాడర్ స్ట్రెంత్‌లో అనవసర పోస్టులు చాలా ఉన్నాయని.. వాటిని తొలగిస్తే ప్రభుత్వానికే బడ్జెట్ మిగులుతుందని చెబుతున్నారు. పైసా ఆదాయం లేకున్నా ఇంకా కార్పొరేషన్‌గా కొనసాగించడం ఏంటని ఓ వైద్యాధికారి ప్రశ్నించారు.
ఇంకెప్పుడు విలీనం చేస్తారు..
టీవీవీపీ మొదటి నుంచి సొసైటీగానే కొనసాగుతున్నది. మిగతా వైద్యసిబ్బందితో సమానంగా సేవలు అందిస్తున్నా.. తమకు వారితో సమానంగా వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు మాత్రం సకాలంలో అందటం లేదని, ప్రభుత్వంలో విలీనం చేయాలని సిబ్బంది కోరుతున్నారు. ఏపీలో 2023, ఆగస్టులో ఏపీవీవీపీని ప్రభుత్వం డీఎస్‌హెచ్‌గా మార్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గడువు ముగియటానికి ముందు టీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై కమిటీని నియమించి చేతులు దులుపుకుంది.
కమిటీ టీవీవీపీని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చాలని సిఫార్సు చేసింది. ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని సూచించింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు టీవీవీపీ నుంచి మోక్షం లభిస్తుందని ఆశించినా.. 21 నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 175 ఆసుపత్రులు..
వైద్య విధాన పరిషత్ పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఎంసీహెచ్, డిస్పెన్సరీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు మొత్తం 175 దాకా ఉండగా, 11 వేలకు పైగా పడకలు ఉన్నాయి. మొత్తం 4,300 మంది వైద్యులు సహా 12 వేల మంది క్యాడర్ స్ట్రెంత్ కాగా.. ప్రస్తుతమంతా కలిపి 7వేల మంది వరకు పని చేస్తున్నారు. ఏటా సుమారు కోటిన్నర మంది వైద్య సేవలు పొందుతున్నారు. టీవీవీపీని ఆరోగ్యశాఖలో పూర్తిగా అంతర్భాగం చేయడం ద్వారా మరింత సమర్థంగా సేవలు అందించొచ్చని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
వీరంతా తమను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్)గా మార్చాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ కూడా సిద్ధంగా ఉంది. టీవీవీపీ రద్దు కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అంతా సిద్ధం చేశారు. ఆరోగ్య మంత్రి కూడా అంగీకరించారు. అయితే తుది నిర్ణయం మాత్రం సీఎం చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది. టీవీవీపీ నుంచి డీపీహెచ్‌గా మారిస్తే సమస్యలన్నీ తీరుతాయని సిబ్బంది కోరుతున్నా ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది.