31-08-2025 01:24:24 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల జేఏసీ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గింది. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోంది. ఇటీవల పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు రూ.183 కోట్లను ప్రభుత్వ విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా వివిధ బిల్లులకు సంబంధించిన పెండింగ్ నిధులను మరో రూ.700 కోట్లను కూడా విడుదల చేసింది. దీంతో జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు బకాయి ఉన్న సాలరీ సప్లిమెంటరీ బిల్లులు రూ. 392 కోట్లు, సెప్టెంబర్ 2024 వరకు బకాయి ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ రూ.308 కోట్లను విడుదల చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఉన్న వివిధ రకాల పెండింగ్ బిల్లులు మొత్తం సుమారు రూ.12 వేల కోట్ల వరకు బకాయిలున్నాయి. అయితే వీటిని ఒకేసారి ఇవ్వడం ప్రభుత్వంపై భారం పడుతుండడంతో నెలకు రూ. 700 కోట్ల చొప్పున చెల్లిస్తామని గతంలో ఉద్యోగుల జేఏసీ నేతలకు హామీ ఇచ్చింది.
నెలకు ఎంతో కొంత బిల్లులను చేస్తూ వస్తోంది. ఈనేపథ్యంలోనే ఆగస్టు నెలకుగానూ రూ.700 కోట్ల నిధులను శనివా రం చెల్లింపులు జరిపినట్లు ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇదే విధంగా మిగిలిన పెండింగ్ డిమాండ్లన్నింటినీ పరిష్కరిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బస్సుయాత్రకు స్పీడ్ బ్రేకేనా?
పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 19న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8 నుంచి 19 వరకు జిల్లాల బస్సు యాత్రను చేపట్టి, అక్టోబర్ 12న ఛలో హైదరాబాద్ పేరుతో లక్ష మంది ఉద్యోగులతో భారీ బహిరంగ సభను నిర్వహి స్తున్నట్లు తెలిపింది.
ఈక్రమంలోనే ప్రభు త్వం దిగొచ్చి సెప్టెంబర్ 2న చర్చలకు జేఏసీ నేతలకు ఇప్పటికే ఆహ్వానం పలుకగా, తాజా గా శనివారం రూ.700 కోట్లు పెండింగ్ బకాయిలను విడుదల చేసింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ జేఏసీ చేపట్టే బస్సు యాత్రకు ప్రభుత్వం స్పీడ్ బ్రేక్ వేసినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 2న చర్చలో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని ఓ జేఏసీ నేత తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఉద్యమ కార్యాచరణ ఉంటుందని జేఏసీ నేతలు అంటున్నారు.