31-08-2025 01:28:23 AM
కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వ్యాధులకు రోగ లక్షణాలు పూర్తిగా పైకి కనిపించవు. దాంతో రోగ నిర్ధారణ కూడా సరిగా జరగకపోవచ్చు. ఎప్పుడైతే రోగ నిర్ధారణ సరిగ్గా జరగదో సహజంగానే సరియైన వైద్యం కూడా పొందలేరు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు కూడా అన్నీ ఒక్కోసారి నార్మల్‌గానే ఉండవచ్చు. అప్పుడు వైద్యం అందడం మరింత కష్టం అయిపోతుంది. దీంతో జబ్బు ఒకటి దానికి ముందు మరొకటి అయ్యే అవకాశం ఉంటుంది. ఫలితం రోగికి ఉపశమనం లభించదు.
పైగా మరిన్ని బాధలకు గురవుతారు. అప్పుడు వైద్యులను, మందులను మార్చి చూస్తారు. గుణం కనిపించకపోతే ఇక మూఢనమ్మకాలు నాటు వైద్యాలను ఆశ్రయించి మరింత నష్టపోతారు. తమ బాధ ఎవరూ అర్థం చేసుకోలేక పోతున్నారని, ఏ మందు వాడినా ప్రయోజనం లేదని వీటన్నింటితో విసిగి వేసారిపోయి ఇక ఎవరిని సంప్రదించరు ఏ మందు వాడరు. తీవ్ర నిరాశ నిస్పృహాలతో డిప్రెషన్‌కు లోనవుతారు. ఏ వైద్యాన్ని, ఏ డాక్టర్ణు నమ్మని స్థితికి చేరుకుంటారు.
తమ బతుకు ఇక ఇంతేనని, ఇలా జీవించడం వ్యర్థమని, ఈ బాధలు భరించేకంటే ఒకేసారి పోయినా బాగుండునని తమలో తాము కుమిలి పోతుంటారు. ఇంతా చేసి వారు మాత్రం బయటికి బాగానే కనిపిస్తారు. వారు అన్ని బాధలు పడు తున్నారని చెప్పినా ఎదుటివారు నమ్మరు. కాబట్టి ఇక ఎవరికీ తమ బాధ గురించి చెప్పుకోరు. ఎందుకంటే ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు కాబట్టి.
అయోమయం లక్షణాలు
పైన పేర్కొన్న బాధలకు, వ్యథలకు చక్కటి ఉదాహరణ అలర్జీ- ఆస్తమా. ఇది ఎన్నో రూపాలలో మనిషిని బాధిస్తుంది. చాలా సందర్భాల్లో ఈ వ్యాధి లక్షణాలు పూర్తిగా బయటికి కనిపించవు. దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, కఫం, తుమ్ములు, జలుబు, గొంతులో గురగుర, ముక్కు కారడం, కళ్ల దురద, గొంతు సరాయించడం, ఏ పనిచేసిన ఆయాసం రావడం, ఏ వాతావరణం పడకపోవడం, ఏది తిన్నా ఏదో తేడా చేయడం చోటు మారితే భయం, నీరు మారితే భయం..
చివరికి అంతా అయోమయం కొద్ది మందిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కొంతమందిలో ఇవన్నీ పైకి కనిపించక పోవచ్చు. డాక్టర్ అడిగినప్పుడు ఏం చెప్పాలో, ఏ బాధ ఉందని తెలియజేయాలో కూడా అర్థం కాదు. డాక్టర్ ఏది అడిగినా అంతా బాగానే ఉందని చెబుతారు. ఆ సమయంలో బాగానే ఉంటారు కూడా. కాని మొత్తం మీద చూస్తే ఎక్కడో ఏదో తెలియని బాధ. ఏదో తేడా, అది ఎలా చెప్పాలో అర్థం కాదు. చెప్పక పోతే డాక్టర్లు కూడా అర్థం చేసుకోలేరు.
గుండెకు సంబంధించిన సమస్యలా
మెట్లెక్కితే ఆయాసం వస్తుంది. గుండె జబ్బులో కూడా ఆయాసం ఉంటుంది. కాబట్టి ఇది గుండెకు సంబంధించిన సమస్యలా కనిపిస్తుంది. అన్ని రకాల గుండె పరీక్షలు జరుగుతాయి. కాని అంతా నార్మల్‌గానే ఉందని రిపోర్టులు, ఒక్కోసారి ఏదో కొంచెం తేడా కనిపిస్తే గుండెకు సంబంధించిన వైద్యం కూడా పొందుతారు. కానీ ఫలితం కనిపించదు. ఎందుకంటే అది అసలు సమస్యే కాదు కాబట్టి. అసలు సమస్య అలర్జీ ఆస్తమా కావచ్చు.
మానసిక వ్యాధిగ్రస్తులుగా
ఇంకొన్ని సందర్భాల్లో వీరు చెప్పే బాధలన్నీ విన్నవారికి, వీరు మానసిక వ్యాధికి గురయినారని, ఏమీ లేకపోయినా ఏదో బాధ పడుతున్నట్లు అనవసరంగా కంగారు పడుతుంటారని, వీరికి మానసిక వైద్యం సరియైనదని అనిపిస్తుంది. కొంతమంది అలర్జీ, ఆస్తమా పేషంట్లు మానసిక వ్యాధిగ్రస్తులుగా ముద్రపడిపోతారు. ఆ విధంగా ఆ వైద్యాన్ని పొందుతుంటారు . రాత్రిపూట వీరికి సరిగా నిద్రపట్టదు. కనుక ఇది నిద్రకు సంబంధించిన సమస్యగా కనిపిస్తుంది. నిద్రలేమి (Insomnia) అనుకుని నిద్రమాత్రలు వాడుతుంటారు.
సమస్య ఒకటి వైద్యం ఇంకొకటి
ఇంకొందరు తమకు జనరల్ వీక్నెస్ ఉందని ఏ పని చేయలేక పోతున్నామని ‘బలం మందులు’ వాడుతుంటారు. ఆ వీక్నెస్‌కి మూలకారణం పైకి కనిపించని అలర్జీ ఆస్తమా కావచ్చు. చాలామంది అలర్జీ, ఆస్తమా పేషంట్లు ఎన్నో ఆపరేషన్లు చేయించుకుంటారు కూడా. ముక్కు ఆపరేషను, గొంతు ఆపరేషన్, చెవి ఆపరేషన్, ఊపిరితిత్తుల్లో కూడా ఆపరేషన్లు జరుగుతుంటాయి. అయితే ఇందులో కొందరికి రిలీఫ్ కలుగుతుంది ఇంకొందరికి ఏ మాత్రం రిలీఫ్ ఉండక పోవచ్చు. ఇలాంటి వారు మళ్లీ సరియైన వైద్యుడితో రోగ నిర్ధారణ చేసుకుని వైద్యం ప్రారంభించాలి.
మహిళల్లో దీర్ఘకాలంగా దగ్గు
మహిళల్లో చాలా మంది దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడుతుంటారు. ఇలాంటి వారిలో కొందరిలో దగ్గినపుడల్లా మూత్రం పడుతుంది. ఇది చాలా బాధాకరమైన సమస్య. ఎవరికీ చెప్పుకోలేని బాధ తీవ్రమైన మానసిక వ్యధకు లోనవుతారు. కొందరికి గర్భాశయం, మూత్రాశయంకు సంబంధించిన సమస్యగా మాత్రమే అనిపిస్తుంది. కొందరు ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు. అయితే ఆ దగ్గు (అలర్జీ ఆస్తమా) తగ్గనంత వరకు ఏ వైద్యం అక్కడ చేసినా ఫలితం అంతగా ఉండదు. కాబట్టి సమస్య మూలాన్ని తెలుసుకుని వైద్యం అందిస్తే అంతా సంతోషంగా ఉంటారు.
సమస్య ఏమిటో తెలుసుకోవాలంటే
* అయితే మీకున్న సమస్య అలర్జీ- ఆస్తమానా లేదా వేరే సమస్యా తెలుసుకోవాలంటే క్రింద పేర్కొన్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చూసుకోండి. అలర్జీ-ఆస్తమా గనక అయితే - మీకు ఏదో ఒకటి పడదు. అది ఏదైనా కావచ్చు, ఏ రూపంలోనైనా ఉండవచ్చు.
* ఉదా: దుమ్ము, ధూళి, పొగ, సెంటు, అగర్బత్తుల పొగ, చలిగాలి మొదలగునవి.
* మీరు ఏ పనిచేసిన త్వరగా అలసిపోతారు: మెట్లెక్కినా, సైకిల్ తొక్కినా, బరువు లేపినా, వడివడిగా నడిచినా, పరిగెత్తినా, ఎత్తుగా కొండపైకి ఎక్కినా మిగతా వారికంటే త్వరగా అలసి పోతారు. వీటితో పాటు జలుబు, దగ్గు, తుమ్ములు కూడా ఉంటాయి.
* ఎప్పుడూ జలుబు, లేదా ముక్కు దిబ్బడ, గొంతు సవరించడం, కఫం ,రాత్రి పూట నిద్రలేక పోవడం, రాత్రి పూట తెల్లవారు జామున దగ్గు, కఫం ఉండవచ్చు.
* తల్లిదండ్రుల్లో గాని, రక్త సంబంధీకుల్లోగాని, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలోగాని, తమ పిల్లల్లోగాని ఇదే విధమైన లక్షణాలు కనిపించవచ్చు.
డాక్టర్‌ను సంప్రదించాలి
ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం బాధపడేది కూడా బహుశా అలర్జీ- ఆస్తమాతోనే అని అనుమానించాలి. ఇక ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. పైన పేర్కొన్న సమస్యలు, బాధలు ఏ వయసు వారికైనా రావచ్చు. అసలైన సమస్యకు సరియైన వైద్యం సకాలంలో అందకపోతే వ్యాధి లక్షణాలు వయసుతో పాటు పెరగవచ్చు. తగ్గవచ్చు. తగ్గి మళ్లీ కనిపించవచ్చు లేదా వేరే జబ్బు లక్షణాలుగా భ్రమ కల్పించవచ్చు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే వారితో పాటు తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు.
అందుకే రోగలక్షణాలను దాచకుండా డాక్టర్‌కు అన్ని విషయాలు రోగి చెబితే సమస్య సులువుగా పరిష్కారం కావచ్చు. చాలా మంది వారి సమస్యను పలు విధాలుగా వ్యక్తం చేస్తారు. ఉన్న దాని కంటే కొందరు ఎక్కువ చెబుతారు. ఇంకొందరు తక్కువ చెబుతారు. మరి కొందరు అసలేమీ చెప్పరు. కానీ బాధపడుతుంటారు. మీరు చెప్పే దానిని బట్టి డాక్టర్ అడిగే దానిని బట్టే సగం వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. మిగతాది క్లినికల్ పరీక్షలు, కొన్ని ప్రత్యేక లాబ్ పరీక్షల ద్వారా జరగవచ్చు.
విష్ణున్‌రావు వీరపనేని శ్వాస పౌండేషన్ ఫౌండర్, శ్వాస హాస్పిటల్ చైర్మన్, నారాయణగూడ, హైదరాబాద్.