31-08-2025 01:16:25 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాలు ఆదివారం వాడివేడిగా జరగనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్, ఓబీసీ రిజర్వేషన్ల బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. దీంతో కాళేశ్వరం నివేదికపై సభలో అధికార, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన శనివారం అసెంబ్లీలో బిజినెస్ అడ్వయిజరీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలు, సభలో చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, పంచాయతీరాజ్, మున్సిపల్, ఓబీసీ రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి చర్చిద్దామని అధికార పార్టీ ప్రతిపాదించింది.
అయితే రాష్ట్రంలో యూరియా కొరత, భారీ వర్షాలతో జరిగిన పంట నష్టంపై చర్చించాలని బీఆర్‌ఎస్, బీజేఎల్పీల నేతలు డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ కోరింది. ప్రతిపక్ష పార్టీలకు పీపీటీ ఇచ్చే సంప్రదాయం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
బీఏసీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
అంతేకాకుండా సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించాలని బీఆర్‌ఎస్, బీజేపీలు కోరాయి. అధికార పార్టీ నుంచి మాత్రం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. గణేశ్ నిమజ్జనం, భారీ వర్షాలతో పంట నష్టం తదితర అంశాలు ఉన్నందున సభ్యులు ని యోజకవర్గాలకు వెళ్లాల్సి ఉంటుందని, అవసరమైతే వచ్చే నెలలో మరో నాలుగైదు రోజులు సభ నిర్వహించి చర్చిద్దామని డి ప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు సూ చించారు.
అందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఒప్పుకోకపోవమే కాకుండా బీఏసీ నుంచి వాకౌట్ చేసింది. ఇక బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కూడా వానలు, వరదలు, కాంగ్రెస్ ఎన్నికల హామీలతో పాటు 30 అంశాలపై చర్చించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదిలో కనీసం 100 రోజుల వరకు సభ నిర్వహించేదని గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని, ఒకటి, రెండు రోజులు సభ నిర్వహిస్తే రాష్ట్రంలో నెలకొన్న అంశాలపై సమగ్ర చర్చ ఎలా జరుగుతుందన్నారు.
ఈ సమావేశాలు కనీసం 15 రోజులైన నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం నివేదిక, మరో మూడు బిల్లులపైనే చర్చ ఉంటుందని, మిగతా అంశాలపై తర్వాత చర్చిద్దామని సూచించారు. దీంతో అసెంబ్లీ ఆదివారం రోజునే ముగించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఒక కాళేశ్వరం నివేదికపై చర్చ పూర్తికాకపోతే సోమవారం కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
బీఏసీ సమావేశానికి అధికార పక్షం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఎంఐఎం, సీపీఐ పక్షనేతలు హాజరుకాలేదు.
బీఆర్‌ఎస్ వైఖరి ఏంటి?
అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన కాళేశ్వరం కమిషన్ నివేదికతో పాటు పంచాయతీ రాజ్, మున్సిపల్, బీసీ రిజర్వేషన్ల బిల్లులపై చర్చపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై చర్చనీయాంశంగా మారింది. ఈ సభకు కేసీఆర్ కూడా రావాలని ప్రభుత్వం నుంచి అప్పీల్ చేస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు చర్చలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనే హాట్ టాఫిక్‌గా మారింది.
కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను చర్చించకుండా చూడాలని కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సోమవారం హైకోర్టులో వాదనలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆదివారమే శాసన సభలో ప్రవేశపెట్టనుంది. ఈ చర్చలో బీఆర్‌ఎస్ పాల్గొని ప్రభుత్వం చేసే వాదనలను తిప్పి కొడుతుందా? లేక వాకౌట్ చేసి బయటికి వెళుతుందా, అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.