20-09-2025 12:22:03 AM
మోతె, సెప్టెంబర్ 19 : పల్లెల్లో బెల్ట్ షాపుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. మోతె మండలంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. మండల వ్యాప్తంగా 150 _ 200 వరకు ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అంటే వారి సామ్రాజ్యం ఎంతలా విస్తరించిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. లైసెన్సులు తీసుకొని నిర్వహించే వైన్స్ లలో సమయపాలన పాటిస్తారు కానీ, వీరి షాపులు మాత్రం 24 గంటలు మందుబాబులకు అందుబాటులోనే ఉంటాయి.
అయితే మద్యం వ్యాపారమంతా ఈ బెల్టు షాపుల ద్వారానే సాగుతుందనేధి జగమెరిగిన సత్యం. మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ బెల్టు షాపులతో మద్యంప్రియుల జేబులకే కాకుండా వారి ఆరోగ్యానికి సైతం చిల్లులు పడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆ శాఖ అధికారులకు పట్టిన మామూళ్ల మత్తు వదలడం లేదని స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. వైన్స్ డీలర్లు, ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఎవరికివారు జేబులు నింపుకునే పనిలో పడడంతో వ్యవస్థ ’నీకింత.. నాకింత’ అనే విధంగా తయారయిందనే అభిప్రాయాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
కమిషన్ కక్కుర్తితోనే.. :
నిబంధనల మేరకు మద్యం విక్రయిస్తే వైన్స్ డీలర్లకు చీప్ లిక్కర్ పై 20 శాతం, బీర్లపైన 20 శాతం, ఇతర బ్రాండ్ల పైన 14.5 శాతం మార్జిన్ ఉంటుంది. అయితే అత్యాశతో వైన్స్ యజమానులు లిక్కర్ కంపెనీలు ఇచ్చే అదనపు కమిషన్ లకు కక్కుర్తి పడుతున్నట్లు తెలుస్తుంది.
డిమాండ్ లేని మెక్ డోవెల్ కంపెనీ మద్యం. బ్లాక్ బస్టర్, ఖర్జూర, ట్యూబర్గో, రాయల్ చాలెంజ్ వంటి బీర్లను ఎక్కువగా విక్రయిస్తే అదనంగా ముట్టచెబుతామని కంపెనీలు ప్రోత్సహిస్తుండడంతో వైన్స్ నిర్వాహకులు వాటినే విక్రయిస్తూ మద్యం బాబులు కోరుకునే బ్రాండ్లను పక్కన పెడుతున్నారు.
బ్రాండ్ మద్యం బెల్టు షాపులకు మళ్లింపు:
మద్యం బాబులకు కావాల్సిన బ్రాండ్లను వైన్స్ నిర్వాహకులు తెలివిగా బెల్టు షాపులకు మళ్లిస్తూ డిమాండ్ లేని బ్రాండ్లను వైన్స్ లో విక్రయిస్తూ రెండువైపులా సొమ్ము చేసుకుంటున్నట్లు మందు బాబుల ద్వారా తెలుస్తున్న సమాచారం.
అంటే డిమాండ్ లేని బ్రాండ్ లు విక్రయించి కంపెనీల నుంచి అదనంగా లబ్ధి పొందుతున్నారు. మరోవైపు డిమాండ్ ఉన్న సరుకునే బెల్టు షాపులకు వేసి ప్రతి క్వాటర్ కు ఎమ్మార్పీకి అదనంగా రూ.10 వరకు వసూలు చేస్తున్నారనేది బెల్ట్ షాపుల నిర్వాహకులు చెబుతున్న మాట.
ఇక బెల్టు షాపు నిర్వాహకులు ప్రతి క్వార్టర్ కు మరో రూ.20_ రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనేది మండలంలో అందరికీ తెలిసిన విషయమే. మొత్తంగా ఒక క్వార్టర్ కు మద్యం ప్రియులు రూ.30 నుంచి రూ.40 వరకు చెల్లించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు అదనంగా మద్యం ప్రియుల నుంచి డీలర్లు, బెల్టు షాపుల నిర్వాహకులు పిండేస్తున్నారు.
స్టిక్కర్ వేసి మద్యం అమ్మకాలు:
మండలంలో మూడు వైన్స్ షాపులు ఉండగా వైన్స్ షాపుల నిర్వాహకులు బెల్టు షాపులకు అమ్మేటటువంటి మద్యం సీసాల మీద ఒక ప్రత్యేకమైన స్టిక్కర్ ను వేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. బెల్ట్ షాపు నిర్వాకులు ఇతర ప్రాంతాల నుండి మద్యం సీసాలు తెచ్చి అమ్మకుండా వాటిని గుర్తించేందుకు ఈ స్టిక్కర్లు వేస్తున్నట్టు తెలుస్తుంది. అప్పుడప్పుడు బెల్ట్ షాపుల వద్దకు వైన్ షాపులకు సంబంధించిన మనుషులు వెళ్లి వీళ్ళు పరిశీలనలు చేస్తుంటారు.
స్టిక్కర్ ఉంటేనేమో వీరిదని లేకపోతే వేరే వాళ్ళది అని గుర్తిస్తారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన సరుకు అమ్మితే వాటిని పగులగొట్టడంతో పాటు వారి మీద భౌతిక దాడులకు దిగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా అటు ఎక్సైజ్ శాఖవారు గాని, ఇటు పోలీసులు కానీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఇది ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని, ఇప్పటికైనా వారు స్పందించి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న విషయం కానీ వాటిలో అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న విషయం కానీ ఇంతవరకు మా దృష్టికి రాలేదు. అలా అమ్మడం నేరం అటువంటి విషయాలు మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- మల్లయ్య, ఎక్సైజ్ సీఐ, సూర్యపేట