calender_icon.png 7 October, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్చ తెలుగులో అస్తిత్వ ప్రయాణం

06-10-2025 12:38:50 AM

మానవ సమాజంలో భాష కేవలం సమాచార మార్పిడి సాధనం మాత్రమే కాదు. అది భావ ప్రకటన, సంస్కృతి, జ్ఞాన వారసత్వానికి మూలం. అయితే, భాష ఒక్కో ప్రాంతం, వర్గం, వృత్తిని బట్టి కూడా మారుతుంది. దీనినే భాషాశాస్త్రంలో మాండలికం అంటాం. మాండలికం అనేది ఒకే భాషలో ప్రాంతం, వర్గం ఆధారంగా అభివృద్ధి చెందిన ఉపరూపం. తెలుగు భాషలో ప్రధానంగా మాండలిక విభాగాలు ఉన్నాయి. అవి కళింగ, కోస్తా, రాయలసీమ, తెలంగాణ. 

తెలుగు సాహిత్యంలో మాండలిక భాషను తొలి సారిగా స్పష్టంగా ఉపయోగించిన నాటకం గురజాడ అప్పారావు రచన ‘కన్యాశుల్కం’ (1892). నాటక రచనంతా విశాఖ మాండలికంలో ఉంటుంది. పాత్రలు మాట్లాడే భాష వారి ప్రాంతీయ పరిణామానికి అద్దంపడుతుంది. ఇందులో మధురమైన, వ్యంగ్య సమ్మేళనంగా భాష ఉంది. కరుణకుమార్ రచించిన ‘బిల్లల మొలతాడు’ (1897) నెల్లూరు మాండలికంలో భాషా, కుల వ్యాసాంగాన్ని చిత్రిస్తుంది.

1947లో బల్లకట్టు పాపయ్య రచించిన ‘మూగజీవాలు’ కథలో మాండలిక భాష జీవజాలపు చిత్రణను సూచిస్తుంది. తెలంగాణ మాండలికంలో వచ్చిన ప్రాథమిక నాటకాల్లో ‘ముందడుగు’ (1946) ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఈ రచన భాషాత్మక ప్రతిరూపం. రచనలో పాత్రలు మాట్లాడే తీరే రాజకీయపరమైన మార్పులకు హేతువు. ‘మా భూమి’ (1947) నాటకంలో సుంకురెడ్డి వాసిరెడ్డి కృష్ణా, నల్లగొండ ప్రాంతాల మేళకట్టుతో రచన సాగించారు.

నాటకంలోని ప్రధాన పాత్రలు రైతు రంగయ్య, లాఠీధారి దొర, పంచాయితీ గాంధీ. వారు మాట్లాడే మాండలికం ద్వారా ఉద్యమ చైతన్యం వ్యక్తమవుతుంది. ఆధునిక రచయితల్లో గోరేటి వెంకన్న, తగుళ్ల గోపాల్, ఈశ్వరచరణ్, సుదర్శన్ తదితరులు తమ కవిత్వాన్ని మాండలిక భాషతో మలచి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. వీరి రచనలు, దగ్గర ఉండే గుండె చప్పుడు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో వంటి కవితా సంపుటాల్లో ప్రచురితమయ్యాయి. వీటిలోని మాండలిక పదప్రయోగాలు శబ్ద సంగీతం, మాధుర్యంతో నిండి ఉంటాయి 

పాఠ్యపుస్తకాల్లో స్థానం

పాఠ్యసాహిత్యంలో మాండలిక సాహిత్యానికి ప్రస్తుతం ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, రాష్ట్ర విద్యాశాఖ పాఠ్యాంశాల్లో మాండలిక రచనల్ని చేరుస్తున్నాయి. తెలంగాణ మాండలికంలోనే ఎక్కువగా పాఠ్యాంశాలు వస్తున్నాయి. తెలంగాణ మాండలికమంటే కేవలం ప్రాంతీయ పదప్రయోగ యాస మాత్రమే కాదు. ఈ మాండలికం ఒక జీవన శైలికి, ఒక వర్గపు తాత్త్విక స్థితిగతులను వ్యక్తీకరించిన భాష. ఇదే భావంతో తెలంగాణ భాషా కవిత్వం 1970 తర్వాత స్థిరమైన మార్గాన్ని ఎంచుకుంది.

ఈ మాండలికంలో సాహిత్య విమర్శ కూడా ఉంది. భానుమూర్తి రచనలే అందుకు చక్కటి ఉదాహరణ. ఆయన విమర్శనా వ్యాసాల్లో ప్రాంతీయ పద ప్రయోగాలు ఉండేవి. మాండలిక విమర్శను పత్రికా స్థాయికి తీసుకువెళ్లిన తొలితరం రచయితల్లో భానుమూర్తి ఒకరని చెప్పవచ్చు. తెలంగాణ మాండలికంలో తొలి కవితగా గుర్తించదగినది దేవరాజు మహారాజు ‘బతుకు కోసం’ (1970). ఈ కవిత కొత్త గోశాలు అనే సంకలనంలో ప్రచురితమైంది. దీనికి సంపాదకుడు విద్యాసాగర్. కవితలో శ్రమజీవుల జీవన సంక్షోభం, ఆకలి పోరాటం, ఆగ్రహం, నిరాశ ఇవన్నీ మాండలిక మేళకట్టు.

ఈ మాండలికంలో వచ్చిన మరో ముఖ్య రచన పంచరెడ్డి లక్ష్మణరెడ్డి ‘ఇసిత్రం’ (1973). కథనం గ్రామీణ జీవిత నేపథ్యంలో ఉంటుంది. దళిత వర్గ నిరుద్యోగితను ఆవిష్కరించే అద్భుతమైన కవితల సమాహారం. దీంట్లో వినిపించే మాండలిక పదాలు బొలెడు, తల్లిపోరు వంటి పదాలు మట్టిని మనిషిగా మలిచిన శబ్ద రూపాలు. అలాగే భానుమూర్తి ఉరోల్లు (1987) తెలంగాణ ఇంటింటి మాటల బతుకుబాటగా నిలిచింది. యాదవ్ ‘తోక్కుడుబండి’ (1988) వలస జీవితంపై ఆధారపడిన కవితల సేకరణ.  

ముఖ్యమైన కవులు.. మాండలిక రచనలు

తెలంగాణ మాండలికంలో కవితా ప్రస్థానాన్ని చెరగనిదిగా చేసినవారు చెరబండరాజు, అల్లం నారాయణ, డాక్టర్ ఎన్.గోపి, మోతుకూరి ఆశోక్, రేడియం, ఎం.లక్ష్మణాచార్య, కౌముది, పరమాత్మ, భాస్కర్. చెరబండరాజు రచనల్లో ‘సరికొత్త రజాకారు’్ల మేటి. రచనలో మైనారిటీ జీవితాలు, చరిత్ర, వ్యంగ్య చిత్రణ ఉంది. అల్లం నారాయణ ‘దారి’ రచన మారుమూల శ్రమ జీవుల గాథలను చిత్రించింది. డాక్టర్ ఎన్.గోపి ‘మంచి తిండి’, ‘పచ్చిబతుకు శాంతమ్మ’ రచనలు సామాజిక జీవితాలకు సంబంధించినవి. మోతుకూరి ఆశోక్ రచన ‘కొల్పులోల్లం’ రచన పల్లె జీవితంతో ముడిపడి ఉంటుంది.

నైజాం పాలన కాలంలో సామాజిక పరిస్థితుల నేపథ్యంం ఉంటుంది. రేడియం ‘పోరగాడు’ రచన తెలంగాణ పోరాట యోధుని జీవగాథ. ఎం.లక్ష్మణాచార్య ‘బానిస బ్రతుకు’ అనేది వ్యవసాయ కార్మికుడి జీవన చిత్రణ. కౌముది  రాసిన ‘నల్లికుట్లోడు’ రచన కూడా మాండలిక రచనే. పరమాత్మ రాసిన ‘యాది మర్వకుండ్రి’ రచన ప్రాంతీయ అస్థిత్వ గొంతుకగా సాగింది. భాస్కర్ ‘ తుపాకులు గుంజుకుందాం రండి’ రచన పోరాట పిలుపుతో కూడిన విప్లవ రచన.

ప్రజల ఆకలితో కూడిన వాస్తవిక జీవితానికి అద్దం పడుతూ, ప్రభుత్వాల నిష్క్రియతత్వాన్ని  ప్రశ్నించే సాధనంగా తెలంగాణ మాండలికంలో కవితా సంకలనాలు వచ్చాయి. వాటిలో పంచరెడ్డి లక్ష్మణరెడ్డి ‘ఇసిత్రం’ (1973) ప్రసిద్ధం. ఈ సంపుటిలో కవి అచ్చమైన మాండలికంలో, సూటిగా రాజకీయ నేతల పరోక్ష దోపిడీని విమర్శిస్తూ కవితలు రాశారు. ‘నువ్వు పుట్టిన దేశం.. నువ్వు మాకిప్పించిన నాదేశం ఇప్పుడు కూడు లేక అలమటిస్తుంది. కుక్కలు చింపిన ఇస్తరవుతుంది’ అంటాడు కవి ఒక కవితలో. తెలిదేవర భానుమూర్తి ‘ఉరోల్లు’ (1987) సంకలనం ద్వారా మాండలిక భాషను విమర్శాత్మక భాషగా నిలబెట్టారు.

కవి దాస్యం లక్ష్మయ్య మాండలికంలో అద్భుతమైన కవితలు రాశారు. ‘తండ్లాట’ కవితా సంకలనం ఎంతో ప్రసిద్ధి. ‘ఉరి నడుమ రాయబెట్టి/ పోచమ్మ పేరుబెట్టి/ సాక పోసేటోల్లు యాటగోసెటోల్లు/ ఆకలయి తుందంటే బుక్కేడు బువ్వ బెట్టరు’ అంటాడు కవి ఒక కవితలో. ‘మాడితే మాసిపోయే భాష నాది కాదు/ ఊకనే మరచిపోయేది కాదు/ జరంత మనసు పెడితే జలజలరాలే భాష/ గల గల పలికే స్వర్గాలలో ఊట చెలిమితో/పదాలతో భాషకెల్ల తియ్యటి భాష నాది’ అంటాడు మరో కవితలో. నమిలికొండ బాలకిషన్ పక్షపాత భాషా రాజకీయాలపై తీవ్ర విమర్శను మాండలికంలో ‘నా మాట తెలువదంటివి/ నా బాస రాదంటివి/ నా యాస ఎక్కిరిస్తివి’ అంటూ ధిక్కరించాడు.

కోట్ల వెంకటేశ్వరరెడ్డి ‘గుండెకింది తడి’ అనే కవితా సంకలనంలో ‘ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదంటివి/ తిన్నింటి వాసాలు లెక్కడితివి/ తాతలిచ్చిన సారెడు భూమి పై/సగ్గొంటిన కాలవ నీళ్లు నీకు వారె/కళ్ల నీళ్లు నాకు మిగిలె’ పదబంధాల్లో హక్కుల కోసం గళమెత్తిన పదచిత్రణ కనిపిస్తుంది. తెలంగాణ మాండలికంలో కవిత్వ రాతలో పట్టు సంపాదించినవారిలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వెంకట్, జాలూరి గౌరీశంకర్, గ్యారా యాదయ్య, పగడాల నాగేందర్, అన్నవరం దేవేందర్ వంటి కవులు ప్రాచుర్యం పొందారు. వీరి రచనలు మామూలు పదాల్లో కాకుండా, అట్టడుగు జీవితాల భాష ఉంటుంది.

యాసలో వ్యంగ్యం, భావవ్యాప్తి, వస్తు సమృద్ధితో కలగలిసి ఉంటాయి. ఉదాహరణకు, జాలూరి గౌరీశంకర్ రాసిన మాండలిక కవితలు సామాజిక, ఆర్థిక, జాతీయ రాజకీయాలను ప్రశ్నించేతత్వంతో ఉంటాయి. పగడాల నాగేందర్ యాసలో పల్లె బతుకు, మానవీయ శోకం ఉంటుంది. అన్నవరం దేవేందర్ మాండలిక పదచిత్రాలు తెలంగాణ పల్లెల్లోని సున్నిత సంబంధాల చిత్రణ ఉంటుంది.

మొత్తానికి తెలంగాణ మాండలికం చీకటి రాతల్లో వెలుగు వెతికే శబ్దం. ఒక అస్తిత్వం. ఎవరి భాష వారికి ముద్దు. ఎవరి మాండలికం వారికి గౌరవం. ఈ దృష్టితో మాండలికాలను చూడాలి. స్థానిక మాండలికాన్ని ప్రచార మాధ్యమంగా, ప్రయోగ భాషగా తీసుకురావడం నేటి కవుల బాధ్యత. అదే సముచితం కూడా.