06-10-2025 12:35:40 AM
ప్రపంచీకరణ, ఆధునిక జీవన శైలి గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవన మాధుర్యాన్ని దూరం చేస్తున్నాయి. అందుకు ఎవరూ అతీతులుకాదన్న విషయం ఒప్పుకోవాల్సిందే. ఒక్కో మనిషిది ఒక్కో వెత, ఒక్కో కథ. పేదరికం, ఆధ్యాత్మికత, వృత్తి జీవితం, కుటుంబ బాంధవ్యాల చుట్టూ తెలంగాణ గ్రామీణ జీవితం అల్లుకుని ఉంటుంది. అలాంటి నేపథ్యంలో అల్లిన కథలే ‘బర్కతి’ సంకలనం.
అచ్చమైన తెలంగాణ యాసలో, వాస్తవిక చిత్రణతో రచయిత డాక్టర్ సాగర్ల సత్తయ్య ఈ కథలు రాశారు. ‘పరిష్కారం’ కథలో నరసమ్మ అంజయ్య పేద దంపతుల బిడ్డ సరిత పదో తరగతి చదువుతుంటుంది. పాపను చదువు మాన్పించి తల్లిదండ్రులు తాగుబోతు నరేష్‌తో పెళ్లి చేస్తారు. నరేష్ పెట్టే బాధలు తట్టుకోలేక సరిత పుట్టింటికి వస్తుంది. సరిత పట్ల శ్రీనివాస్‌రెడ్డి అనే టీచర్ శ్రద్ధ తీసుకుని ప్రోత్సహిస్తాడు. సరిత మళ్లీ చదువు ప్రారంభించి టీచర్ కొలువు సాధిస్తుంది. ఆడపిల్లల చదువు ప్రాధాన్యతను రచయిత ఈ కథలో వివరించారు.
‘ఊరు బోనాలు’ కథలో ఒక ఊరిలో కులానికి ఒక ముత్యాలమ్మ గుడి ఉంటుంది. ప్రతి కుటుంబం బోనం చేస్తుంది. ‘ఇదేం పద్ధతి?’ అని అడిగిన పట్నం నుంచి వచ్చిన ఒక బాలుడు ఊరి ప్రజలను సూటిగా ప్రశ్న సంధిస్తాడు. ఎవరి నుంచీ సమాధానం రాదు. ‘బర్కతి కథ’లో మూఢవిశ్వాసాలను విశ్వసించే మహిళ కథను రచయిత చెప్పారు. బర్కతి వస్తుందని, ఎల్లమ్మ పండుగ చేయాల్సిందేనని నమ్మిన మల్లమ్మ అమాయకత్వంతో వీరయ్య అనే మంత్రగాడిని ఆశ్రయిస్తుంది. ఎన్ని పండుగలు చేసినా బర్కతి కలుగదు. దీంతో మల్లమ్మ అప్పుల పాలవుతుంది. ‘తశ్వ’ కథలో రచయిత సంచార జాతి చెందిన వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించారు.
కథలో పరశురాములు నరసమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి కుటుంబంలో మద్యం చిచ్చు పెడుతుంది. పరశురాములు కోపంతో భార్యపై దాడి చేయడంతో నరసమ్మ పుట్టింటికి వెళ్తుంది. ఆ పంచాయితీ కాస్త ఊరి పెద్దల దాకా వెళ్తుంది. నరసమ్మ కుటుంబం తశ్వ కోసం పెద్దమనుషులు వద్ద డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అందుకు అప్పు చేయాల్సి వచ్చింది.కానీ.. అప్పు కూడా దొరకని దైన్యం ఆ కుటుంబానిది. ‘కోటి దీపాల వెలుగు’ కథలో కరోనా సమయంలో పదమూడేళ్ల శివాని చదువు ఆగిపోతుంది.
ఆన్‌లైన్‌లో చదువుకోలేని కష్టాలను వివరించారు రచయిత. ‘ఎన్నుగర్ర’ కథ లో యాదగిరి అనే రైతు పత్తి పంటను కాపాడుకునేందుకు అప్పులు చేస్తాడు. వడ్డీలకు వడ్డీలు కట్టి కుంగిపోతాడు. వయసుకొచ్చిన బిడ్డ పెండ్లి చేయలేకపోతాడు. రైతుల కడగండ్లను రచయిత మనకు కళ్లకు కట్టినట్టు వివరిస్తారు. ‘సారె’ కథలో లక్ష్మయ్య పార్వతమ్మ దంపతులు కులవృత్తిపై ఆధార పడి జీవిస్తారు. వారి కుటుంబంలో వచ్చిన కలహాల నేపథ్యంలో కథ సాగుతుంది. తండ్రిని కులవృత్తి విడిచిపెట్టమని కుమారుడు కొరతాడు. తండ్రి తుదిశ్వాస విడిచేవరకూ వృత్తిని విడిచిపెట్టడు.
ఈ మధ్యన ఏం జరిగిందనేదే కథ వృత్తాంతం. ‘తోడేళ్లు’ కథలో రాజమల్లు అనే గొర్రెల కాపరి జీవాలను ప్రాణంగా చూసుకుంటాడు. అతడి దైనందిన జీవితం జీవాలతోనే ముడిపడి ఉంటుంది. ఒకానొక సమయంలో జీవాలను రక్షించుకునేందుకు రాజమల్లు తోడేళ్లతోనూ కలబడతాడు. చివరకు తోడేళ్ల చేతిలో ప్రాణం విడుస్తాడు. అతడి త్యాగం వెలకట్టలేనిదన్న కోణంలో రచయిత కథను ఆవిష్కరించారు. ‘ఓ మొగ్గ నవ్వింది’ కథలో బాల్యవివాహాలపై చర్చించారు. పదోతరగతి కూడా పూర్తి కాని బిడ్డకు ఓ తండ్రి పెళ్లి చేయాలని చూస్తాడు. చివరకు ప్రభుత్వ యంత్రాంగం రంగప్రవేశం చేసి బాలిక పెళ్లిని అడ్డుకుంటుంది.
ఈమధ్యలో ఏం జరిగిందనేది కథ వృత్తాంతం. ‘చాపకింద నీరులా..’ అనేక కథలో డ్రగ్స్ యువత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాన్ని రచయిత చర్చించాడు. బర్కతి, బువ్వ కుండ, గంజి పేర్పు, కూరాడు, ఒత్తు కుండ, నీళ్లగోళెం, కాగులు, దొంతులు, కల్లు కంచుడు, బొడ్డు గురుగులు, పిందార, తశ్వ, ఎన్నుగర్ర, దంపెడు పేర్పు, కొంకన పోగు, జకముక సంచి, చిమ్మట, దేశిత్, ఏకాన, ఇగురం గల్లోడు.. ఇలా తెలంగాణ మాండలికంలో సొగసును పాఠకులకు తెలియజెప్పారు రచయిత. మొత్తానికి ఈ సంకలనం డౌన్ టు ఎర్త్ కథలు. వాస్తవికత చిత్రణను ఇష్టపడే పాఠకులు తప్పకుండా చదవాల్సిన పుస్తకమిది.
కొండేటి ప్రకాష్