03-01-2026 12:12:45 AM
మాస్టర్ ప్లాన్ లేకుండా ఎలా చేస్తారు?
అర్హులందరికీ రుణమాఫీ చేయాలి
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
మేడ్చల్, జనవరి 2 (విజయక్రాంతి): మాస్టర్ ప్లాన్ లేకుండా గ్రామాలను మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో విలీనం చేయడం అశాస్రీయమని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ గ్రామంలో కన్జర్వేషన్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిర్వహించిన సమావేశానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పునర్విభజనలో శాస్త్రీయత, సాంకేతి కత లేదని, ముందుగా మాస్టర్ ప్లాన్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఏ జోన్లు ఎక్కడ ఉండాలో నిర్ణయించాలని, పరిశ్రమలు సిటీ బయట ఉండాలన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్డు భూ సేకరణలో అనేకమంది రైతులకు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రింగ్ రోడ్డు రావడం సంతోషమే గాని దీనివల్ల ధనవంతులు, పెట్టుబడిదారులు లాభ పడ్డారని, రైతులు నష్టపోయా రన్నారు. 2013 నాటి మాస్టర్ ప్లాన్ ను మార్చాలని బండారు దత్రాత్రేయ డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రేడియో రోడ్లకు రైతులకు దారి కల్పించాలన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లపై రైల్వే వంతెనలు నిర్మించాలన్నారు.కన్జర్వేషన్ జోన్ ఎత్తివేయాలని రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమ లు కాకపోవడం విచారకరమన్నారు.వెంటనే అర్హులందరికీ రుణ మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అవసరమైతే రైతులు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ నాయకుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిర్మల, సొసైటీ మాజీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి, బలరాం రెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.