19-11-2025 07:56:13 PM
గద్వాల: వయోవృద్ధులు తమ జీవిత అనుభవంతో పిల్లలకు మంచి విషయాలు చెబుతుంటారని, వెలకట్టలేని ఆ విషయాలను పాటిస్తే ప్రతి ఒక్కరూ ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ ఫోరం సహకారంతో బుధవారం గద్వాల ఐడిఓసి సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా తగ్గుతోందని, ఈ పరిస్థితులకు కారణాలేంటో అధ్యయనం చేసి పరిష్కరించవలసిన అవసరం ఉందన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇబ్బంది పెట్టాలని చూడరన్నారు.
యువత భవిష్యత్తులో వృద్ధులు కాక తప్పదని తెలుసుకుంటే వారి తల్లిదండ్రులను తాము ఇప్పుడు బాగా చూసుకుంటేనే తమ పిల్లలు కూడా తమ బాగోగులు చూస్తారని తెలుసుకోవాలన్నారు. అనంతరం వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిధులు బహుమతులు అందజేశారు. అలాగే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన సీనియర్ సిటిజన్స్ ను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.