calender_icon.png 26 August, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందనూలులో నకిలీ ఎరువులు!

26-08-2025 03:24:27 AM

  1. రెండు రోజుల క్రితం నోటీసులు అందుకున్న దుకాణంలోనే నకిలీ ఎరువులు వెలుగులోకి
  2. ఎరువుల బస్తాలతో కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన

నాగర్‌కర్నూల్, ఆగస్టు 25 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో నకిలీ ఎరు వులు అంటగట్టారని రైతులు కలెక్టరేట్ ముందు ఎరువుల బస్తాలతో నిరసన తెలిపారు. ఈ ఘటన సోమవారం నాగర్‌క ర్నూల్ కలెక్టరేట్ వద్ద చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిసరాల్లో ఉన్న నాగార్జున ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువుల బస్తాలు కొనుగోలు చేశారు. నాణ్యమైన డీఏపీ బస్తా ధర తీసుకున్న ఫర్టిలైజర్ దుకాణదారు.. నాసిరకమైన తేలికపాటి బరువు గల ఎరువులను అంటగట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గత రెండు రోజుల క్రితమే రైతులకు యూరియా బస్తాల పేరుతో ఓల్డ్ స్టాక్ ఎరువులను బలవంతంగా అంటగడుతూ యూరియా బస్తా కూడా అధిక ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న విషయంలో వార్తలు రావడంతో అధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. నోటీసులకు వివరణ ఇవ్వకముందే ఈ నకిలీ ఎరువుల విషయం బయటపడటం విశేషం. ఇదే విషయంపై స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టినట్టు రైతులు తెలిపారు. కాగా.. ఎరువుల దుకాణదారు ఓ మధ్యవర్తికి ఫోన్ చేసిన వెంటనే.. కలెక్టర్‌కు ఫిర్యాదు ఇవ్వకుండానే ఎరువుల బస్తాలను తిరిగి ఆటోలో వేసుకొని రైతులు వెనుదిరిగారు. భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.