calender_icon.png 26 August, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్ముంటే తెలంగాణలో.. దొంగ ఓట్ల లెక్కలు తేల్చు

26-08-2025 03:20:52 AM

పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు  ఎంపీ డీకే అరుణ సవాల్ 

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): బీజేపీపై కరీంనగర్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ మండిపడ్డారు. ఆయనకు మతిభ్రమించి, అధికార అహంకారంతో మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్లను ఏరేయాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అప్పుడు దొంగలేవరో.. దోషులవరో తేలిపోతుందన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, తన మనుగడ కోసం దొంగ ఓట్ల రాగం అందుకుందని ఆరోపించారు.

ఇక్కడ దొంగ ఓట్లు ఉంటే.. మీరు కూడా దొంగ ఓట్లతో గెలిచినట్లేనని ఆమె ఎద్దేవా చేశారు. దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్టుందని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. వారికి సాధ్యమైతే తెలంగాణలో దొంగ ఓట్ల లెక్కలు తేల్చాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్న నేపథ్యంలో ఆ లోపు బోగస్ ఓట్ల గుట్టు విప్పాలన్నారు. తెలంగాణాలో దొంగ ఓట్లు ఉన్నాయని బీజేపీ ముందే చెప్పిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి మతిభ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వాపోయారు.

ఆయన రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్ మధ్య నలిగిపోతున్నట్టున్నాడని వాపోయారు. అందుకే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని స్థితిలో మహేశ్‌గౌడ్ ఉన్నారని తెలిపారు. ‘దేవుడి పేరు చెప్తే తప్పా.. దేవుడు, ధర్మం గురించి మాట్లాడితే తప్పా.. బిచ్చం అడుక్కున్నట్లా... కాంగ్రెస్ వాళ్లు దేవుళ్ల గురించి మాట్లాడకండి, ధర్మం గురించి మాట్లాడవద్దు, ఇంకేదైనా మాట్లాడాలి’ అని సూచించారు. దేవుళ్ల గురించి మాట్లాడితే బిచ్చగాళ్లు అనటం అంటే ప్రజల మనోభావాలు దెబ్బతీయడం కాదా అని ప్రశ్నించారు.

ఇలాంటి పిచ్చి మాటలు మానుకోకపోతే కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే కుల రాజకీయమని.. వారికి కులం పేరు చెప్పకుండా ఓట్లడిగే దమ్ముందా అని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సంగతి సరే కానీ.. మహేశ్ కుమార్ ముందు నీ పార్టీ లో నువ్వు సీఎం పదవి తెచ్చుకోవాలని సూచించారు. చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.