26-08-2025 01:22:00 AM
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లయిన ఉస్మానియా, గాంధీ, ఈఎన్‌టీ, నీలోఫర్, ఛెస్ట్ హాస్పిటల్, నయాపూల్, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ హాస్పిటల్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రులకు గడిచిన 6 నెలలుగా ఔషధాలు, పరికరాలు సరఫరా లేదు. అయినా సర్కారు నుంచి కనీసం స్పందన లేదు.
ప్రభుత్వ టీచింగ్ హాస్పిటళ్లు ఈ ఏడాది మార్చి నుంచి మందుల సరఫరా నిలిచిపోయింది. గతప్రభుత్వం హయాం (2022) నుంచే సప్లయర్లకు పెద్దఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వారు హాస్పిటళ్లకు మందుల సరఫరా ఆపేశారు. దీంతో పేదల వైద్యానికి భరోసానిచ్చే ఉస్మానియా, గాంధీ, పేట్లబుర్జు, నీలోఫర్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ తదితర హాస్పిటళ్లకు మందులు, పరికరాల సరఫరా నిలిచిపోయింది.
ఫలితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యానికి బిల్లుల గండం పట్టుకుంది. బీఆర్‌ఎస్ సర్కార్ పెండింగ్‌లో పెట్టి పోయిన బిల్లులను కాంగ్రెస్ సర్కారు అదే రీతిన కొనసాగిస్తోంది. ఫలితంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రజారోగ్యంపైనే ప్రధానంగా దృష్టి సారించాల్సిన ప్రభుత్వం పట్టింపు లేనట్టుగా వ్యహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.
సర్కారుకు ఎందుకు పట్టడం లేదు..
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లకు మందులు, పరికరాలను సరఫరా చేసే బాధ్యత తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ)ది. అన్ని సర్కారు దవాఖానలకు కూడా ఈ కార్పొరేషన్ ద్వారానే మందులను సరఫరా చేస్తారు. ఇందులో టీజీఎంఎస్‌ఐడీసీ సరఫరా చేయని మందులు, పరికరాలను 20 శాతం మేర సూపర్ స్పెషాలిటీ, టీచింగ్ హాస్పిటల్స్ టెండర్ల ద్వారా నేరుగా కొనుగోలు చేస్తాయి.
ఎందుకింత నిర్లక్ష్యం..
ఉస్మానియా, గాంధీ, ఈఎన్‌టీ హాస్పిటల్, సరోజినీ కంటి ఆసుపత్రి, నీలోఫర్, మెటర్నిటీ, ఛెస్ట్ హాస్పిటల్స్‌లో అత్యధిక సర్జరీలు జరుగుతాయి. ఈ ఆసుపత్రులన్నీ పేదల వైద్యానికి భరోసానిస్తాయి. ఇలాంటి దవాఖానలకే ముఖ్యమైన మందులు సప్లయ్ చేయకుంటే వైద్యులు మాత్రం ఎలా ట్రీట్‌మెంట్ ఇస్తారు. తమ వద్ద ఉన్నంతలో వైద్యం అందిస్తూ రోగులకు సేవలు అందించే పరిస్థితి ఏర్పడింది. తమ ఫార్మసీలో లేని మందులు, పరికరాలను బయటి నుంచి తెచ్చుకుంటే తప్ప చికిత్స అందించని పరిస్థితి ఏర్పడిందని వైద్యులు వాపోతున్నారు.
సమస్యలను బయటకు చెప్పేందుకు వైద్యులు జంకుతున్నారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే వైద్యంతో పాటు మందులు, పరికరాలు అంతా ఉచితమే అని భావించే పేదలకు ఇప్పుడు ఆ పరిస్థితే కనిపించడం లేదు. కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, ఆర్థో, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ, పల్మొనాలజీ, ఐసీయూ, ఎమర్జెన్సీ కేర్, ఆంకాలజీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తదితర చికిత్సలకు మందులు, పరికరాల సరఫరా ఆగిపోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు ఇబ్బందులు తప్పడం లేదు.