26-08-2025 03:22:37 AM
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర వైఫల్యమే కారణమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సోమవారం ప్రకటనలో విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడితో వారంలో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని తెలిపారు. రైతాంగానికి యూరియా సరఫరాలో ఆలస్యం కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు.
కేంద్రం అసమర్థతతో ఇతర దేశాల నుంచి యూరియాను తెప్పించి, రాష్ట్రాలకు సరఫరా చేయడంలో ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేయొద్దన్నారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంత వరకైనా పోరాడతామని తేల్చి చెప్పారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి రావాల్సిన యూరియాను తెప్పించడానికి ఇప్పటికే ఆ సంస్థ ఎండీతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. పాత నిల్వలతో కలుపుకుని 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్టు స్పష్టం చేశారు.