18-12-2025 07:57:17 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): జిహెచ్ఎంసి పోచారం సర్కిల్ పరిధిలోని యంనంపేట్ శ్రీరంగనాయక స్వామి దేవాలయం నిర్వాహణ ఉద్యోగులపై అసత్య ఆరోపణలు ఏమాత్రం తగదని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి అన్నారు. ఆలయ నిర్వహణపై కొందరు వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తుండటంతో గురువారం ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆలయ నిర్వహణకు సంబంధించి దొంగలెక్కలని దుష్పచారం అని చేస్తున్న వారికి ఆ భగవంతుడే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
ఆలయ నిర్వహణకు సంబంధించిన లెక్కలు సక్రమంగా చూపిన తర్వాత కూడా తనతో పాటు జూనియర్ అసిస్టెంట్ మనీషా, పూజారి రాఘవాచార్యులను ఆలయ చైర్మన్ భర్త, ఇద్దరు ఆలయ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈవో భాగ్యలక్ష్మి తెలిపారు. తాము ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రతిదానికి రసీదు ఇస్తున్నామని, తాము ప్రభుత్వం తరఫున ఉద్యోగులమైన తమను ప్రతిదానికి తప్పుతీస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. విరాళం బుక్కులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని, శ్రీనిధి కళాశాల యజమాన్యం ఆలయ అభివృద్ధికి రూ. 50 వేలు చెక్కు ఇవ్వడంతో ఆ చెక్కు డ్రా చేసి ఆ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
లేనట్లయితే ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఎలా చేస్తారో చూస్తామంటూ ఆలయానికి తాళం వేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఆలయ చైర్మన్ ఏమి మాట్లాడదని ఆమె భర్త అధికారం చలాయించడo ఏమిటని ప్రశ్నించారు. సమావేశం ఏర్పాటు చేస్తే ధర్మకర్తలు మధ్యలోనే వెళ్లిపోతారని ఇలాంటి వారితో ఉద్యోగం ఎలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను రక్షణగా పెట్టుకుని ఉద్యోగం చేసే పరిస్థితి దాపురించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పనులు చేయాలని ఒత్తిడి చేస్తారని, వేలం పాటను ఆపుతారని, హుండీ తీయకుండా అడ్డుతగలడం, చెక్కుపై సంతకం చేయకుండా సతాయించడం, చైర్మన్ కు చెక్కు పవర్ ఉన్నది దేనికని ప్రశ్నించారు. దేవాలయ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.