30-07-2024 12:45:36 AM
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణరావు, నాగరాజు, అనిల్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణరావు, నాగరాజు, అనిల్ కుమార్ రెడ్డి.. మాజీ మంత్రి హరీష్‌రావును హెచ్చరించారు. సోమవారం వారు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై అంతా పారదర్శకంగా ఉంటే అధిక ధరకు విద్యుత్‌ను కోనుగోలు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు.
మోటార్లకు మీటర్లు పెడతామన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఒప్పందాలను సీఎం బయటపెట్టడం తప్పా అని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోతే ఆ విషయం తెలియకుండా పతిపక్షాలు, మీడియా వెళ్లకుండా పోలీస్ బందోబస్తు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్షకోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ ఒప్పందాల అంశంపైన జగదీష్ రెడ్డి అసెంబ్లీలో అన్నీ అబద్ధ్దాలే చెప్పారని వారు ఆరోపించారు.