30-07-2024 12:49:22 AM
అందుకే రూ.వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది
నాడు జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్‌పై పర్యవేక్షణ కరువు
అక్రమార్కులకు అదే ఆసరైంది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 29( విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో జీఎస్టీపై ఎలాంటి ఆడిట్ జరగలేదని, దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు కుంభకోణానికి పాల్పడ్డారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే రాబడికి గండి పడిందని చెప్పారు. అసెంబ్లీలో వాణిజ్య పన్నుల శాఖపై ఆయన మాట్లాడారు. ఆ శాఖలో లీకేజీలను అరికట్టి, ఆదాయాన్ని పెంచుకొనే ఉద్దేశంతో లోపాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం వేసిన కమిటీ విచారణలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినట్టు తేలిందని వెల్లడించారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడిట్ చేయడం వల్ల ఆదాయం పెరిగిందని స్పష్టంచేశారు. ఒక రాష్ట్రంలోని డీలర్, మరో రాష్ట్రంలోని డీలర్‌కు వస్తువులను అమ్మినప్పుడు.. వాటిపై ఐజీఎస్టీని కేంద్రం వసూలు చేస్తుంది. ఆ తర్వాత ఐజీఎస్టీని రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున కేంద్రం పంపిణీ చేస్తుంది. వస్తువులు కొన్న ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు జీఎస్టీఆర్-1ఫైలింగ్ చేయాలి. వస్తువును అమ్మిన డీలర్లు జీఎస్టీఆర్ సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ వివరాలు వెల్లడవుతాయి. కానీ, ఇక్కడ ఎలాంటి లావాదేవీలు జరగలేదు. అయినా తప్పుడు ఇన్వాయిస్‌ను సృష్టించి, రాష్ట్రంలో జీఎస్టీఆర్ ఇతర రాష్ట్రాల్లో జీఎస్టీఆర్ ఫైల్ చేశారు. తద్వారా వచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీని పొందారు. ఎలాంటి లావాదేవీలు జరగకుండానే అక్రమార్కులు ఇన్‌పుట్ సబ్సిడీని పొందారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
వందల నకిలీ కంపెనీలు..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిపిన విచారణలో కొన్ని వందల నకిలీ కంపెనీలు ఉన్నట్టు తేలిందని ఆది శ్రీనివాస్ చెప్పారు. ఈ విచారణలో 74 కేసుల్లో రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం జరిగినట్టు ప్రభుత్వం గర్తించిందని వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి, రిటర్న్ ఫైలింగ్, జీఎస్టీ ఆడిట్ పట్టించుకోకపోవడం వల్లే అక్రమార్కులు చెలరేగిపోయారని ఆరోపించారు. జీఎస్టీ ఫైలింగ్‌పై తమ ప్రభుత్వం రిటర్న్ ఫైలింగ్ దృష్టి పెట్టిందని, తద్వారా 72 శాతం ఉన్న రిటర్న్ ఫైలింగ్.. ప్రస్తుతం 80 శాతానికి చేరుకున్నదని స్పష్టంచేశారు.