28-05-2025 10:13:30 AM
మహబూబాబాద్, (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలకు(Grain Purchasing Centers) తీసుకువచ్చి, కాంటాలు నిర్వహించినా మిల్లులకు తరలించడం లేదని, వర్షాలకు బస్తాల్లోని ధాన్యంలో మొలకలు వస్తున్నాయని, వెంటనే ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ మొలకలు వచ్చిన ధాన్యంతో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) దంతాలపల్లి - సూర్యాపేట ప్రధాన రహదారిపై గున్నేపల్లి వద్ద రైతులు బుధవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు(Farmer ) మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో గున్నేపల్లి వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ లారీలు పంపించకుండా జాప్యం చేస్తున్నారని, రోజుల తరబడి ధాన్యం బస్తాల వద్ద నిరీక్షించాల్సి వస్తోందని, వర్షాల కారణంగా ధాన్యం మొలకెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే లారీలను తెప్పించి ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేసి ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుకు అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి బైఠాయించారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు(Revenue Officers) అక్కడికి చేరుకొని ధాన్యాన్ని వెంటనే తరలిస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింప చేశారు.