calender_icon.png 25 January, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలిమంటల మధ్య రైతులు

25-01-2026 12:00:00 AM

  1. యూరియా కోసం అర్ధరాత్రి నుంచే పడిగాపులు
  2. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అన్నదాతల గోస
  3. మునుగోడు, గోపాలపేటలో ఆందోళన

నాగర్‌కర్నూల్/గోపాలపేట, జనవరి 24: రాష్ట్రంలో మళ్లీ యూరియా కొరత రైతులను వేధిస్తోంది. అర్ధరాత్రి నుంచే కొనుగోలు కేంద్రాల వద్ద చలిమంట కాగుతూ రైతులు  పడిగాపులు కాస్తున్నారు. క్యూలో పాసుబుక్కులు పెట్టి నిల్చుంటున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం చాకలపల్లి, బుద్ధారం, ఏదుట్ల, చెన్నూరు, తాడిపర్తి, మున్ననూరు, తిరుమలపురం, ఎర్రగట్టు తండా గ్రామాల రైతులు యూరియా కోసం సింగిల్ విండో కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు.

ఎక రాకు ఒక యూరియా బస్తా చొప్పున అందించిన రైతులకు మాత్రం సరిపడా యూరియా అందడం లేదని వాపోతున్నారు. గత వారం నుండి రాత్రి 12 గంటల నుంచి 12 గంటల వరకు తిండి తిప్పలు లేకుండా సింగిల్ విండో కార్యాలయం ముందు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి యూరియా కోసం రైతులు తమ పాసు పుస్తకాలను క్యూ లైన్‌లో ఉంచారు. చలికి తట్టు కోలేక సింగిల్ విండో కార్యాలయం ముందే తమ పాసు పుస్తకాలను లైన్లో ఉంచి చలి మం ట వేసుకున్నారు.

వారం రోజులుగా యూరి యా కోసం చలిమంటలు వేసుకొని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అవుతుందని రైతులు మండిపడుతున్న సంఘటన వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ముందు ఘర్షణలు వెలువెత్తుతున్నాయి. దీం తో ఆగ్రహించిన రైతన్నలు శనివారం సింగిల్ విండో కార్యాలయాన్ని చుట్టుపెట్టారు. అక్కడే తమ అందరికీ వెంటనే యూరియా అందజేయాలని రోడ్డుపై ధర్నాకు దిగారు. అధికారు లు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి వెంటనే రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో 

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి చలికి వణుకుతూ యూరియా పంపిణీ కేంద్రం వద్ద క్యూ లైన్‌లో కాళ్లకు తిమ్మిర్లు వచ్చేదాకా దీనంగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం 11 గంటలకు యూరియా పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో శుక్రవారం రాత్రి నుండే సెంటర్ కు వచ్చి పడిగాపులు కాశారు. క్షేత్రస్థాయిలో ఆయా సెంటర్ల వద్ద రైతులను నానా తిప్పలు పెడుతున్నారు.

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాలను సైతం వ్యవసాయ శాఖ అధికారులు బేఖాతర్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటీపీ, వేలిముద్రలు వంటి సమస్యలు ఉన్నాయంటూ రైతులకు సరైన సమాచారం ఇవ్వ కుండా రోజుల తరబడి తిప్పడంతో పంట కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ ధనిక రైతులకు మాత్రం యూరియా బస్తా ధర 350 చొప్పున జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఫర్టిలైజర్ దుకాణదారు వందల సంఖ్యలో యూరియా బస్తాలు పం పిణీ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పూర్ణచందర్రావు స్పందిస్తూ ప్రతి మండలంలో యూరియా బస్తాలు అం దుబాటులోనే ఉన్నాయని ఈసారి అత్యధిక స్థాయిలో యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు తెలిపారు రైతులు ఎవరు ఆందోళన చెం దాల్సిన పనిలేదని ప్రతి రైతుకు యూరియా అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

యాప్‌ను రద్దుచేయాలి

మునుగోడు(విజయక్రాంతి): యూరియా ఆన్‌లైన్ యాప్ రద్దుచేసి రైతులకు యూరి యా కొరత లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం యాదాద్రి జిల్లా కార్యదర్శి గురుజ రామచంద్రం డిమాండ్ చేశారు. మునుగోడు మండల కేంద్రంలో రైతులతో కలిసి శనివారం రాస్తారోకో నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూరియా యాప్ వల్ల రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సర్వర్ సమస్యలతో యూరియాను సరి అయిన సమయంలో పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వం గతం మాదిరిగానే సొసైటీల ద్వారా, ఫర్టిలైజర్ షాపులలో యూరియాను అందుబాటు లో ఉంచాలని కోరారు.