calender_icon.png 20 December, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలి

20-12-2025 08:26:26 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్,(విజయక్రాంతి): ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యూరియా యాప్ వినియోగంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు సులభంగా యూరియా పొందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. జిల్లాలో ప్రతి రైతుకు ఈ యాప్ పై ఖచ్చితంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ యాప్ ద్వారా రైతులు సులభంగా తమకు కావల్సిన యూరియా పొందగలుగుతారని అన్నారు. యాప్ వాడకంలో రైతులకు సహాయపడాలని చెప్పారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ యాప్ ద్వారా యూరియా ఎక్కడ, ఎంత మొత్తంలో అందుబాటులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. యూరియా, ఎరువుల వాడకంపై రైతులకు వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉండాలని తెలిపారు. వారు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం ను బట్టి మాత్రమే రైతులు యూరియా వినియోగించేలా వారిని ప్రోత్సహించాలని అన్నారు.

అధిక మోతాదులో యూరియా వల్ల కలిగే నష్టాలను వారికి వివరించాలని తెలిపారు. యూరియా వినియోగం శాస్త్రీయంగా ఉండాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ పంటల సాగు వల్ల పొందే ఆర్థిక లాభాలను రైతులకు వివరించి, పెద్ద మొత్తంలో రైతులు ఆయిల్ పామ్ పంటలు సాగు చేసేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు.