calender_icon.png 16 August, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఉసురు ఉట్టిగా పోదు!

14-08-2025 01:10:02 AM

-యూరియా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వాలు 

-మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట రూరల్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే రైతులకు యూరియా కొరత ఏర్పడిందని, రైతుల ఉసురు ఉట్టిగా పోదంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో రైతులు యూరియా కోసం బారులు తీరగా వారి వద్దకు వెళ్లి యూరియా కొరత గురించి అడిగి తెలుసుకున్నారు.

4 రోజు ల నుంచి వ్యసాయ పనులు మానుకుని పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఒక ఆధార్ కార్డుకు ఒకటే బస్తా ఇస్తామంటున్నారని, ఆధార్ కార్డు, ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నట్లు హరీశ్‌రావుతో రైతులు తమ ఆవేదన ను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు రైతులు తగిన గుణపాఠం చెపుతారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 51 సార్లు ఢిల్లీకి పోయినా ఎరువుల కొరత తీర్చలేదన్నారు. తిట్లు ఎక్కువ, పని తక్కువ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చెప్పిన మాటను గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి తిట్ల మీద ఉన్న ద్యాస పని మీద లేదని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ఎరువులు ఎట్లా వచ్చాయి, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఉంటే ఎందుకు రావడం లేదని రైతులు సూటిగా అడుగుతున్నారని పేర్కొన్నారు.

ఓటీపీ, ఒక్క బస్తా విధానాన్ని తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గ్రామం నుంచి రైతు బయటకు వెళ్లకుండా హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు లేకుండా రైతు సమయం వృథా కాకుండా గ్రామంలోనే తమ ప్రభుత్వం ఎరువులు అందించిందని గుర్తు చేశారు.

దేవుడు దర్శనం దొరుకుతుంది కానీ ఎరువుల బస్తా దొరకడం లేదని మహిళా రైతు భాగ్యమ్మ చెప్పడం ప్రభుత్వానికి రైతుల పట్ల చిన్నచూపునకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, నానో యూరియా వాడాలని చెప్పడం రైతులపై రూ.500 అదనపు భారం వేయడమేనని మండిపడ్డారు. ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోడానికి కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తుందని హరీశ్‌రావు విమర్శించారు.

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలి

హైదరాబాద్ (విజయక్రాంతి): కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు నింపాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. రిజర్వాయర్‌లలో నీటిని సకాలంలో నింపక పోవడం వల్ల పంటల సాగు ముందుకుపోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ- 6 వద్ద గల మోటార్లను ఆన్ చేసి ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలోని మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు నింపి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని విజ్ఞప్తి చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 14 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని, కడెం నుంచి దాదాపు 22,300 క్యూసెక్కుల వరద ఉందని, అదేవిధంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో పూర్తి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 45 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని తెలిపారు.

లోయర్ మానేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి లభ్యత 7 టీఎంసీల ఉందని, మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని నింపి ఎస్సార్‌ఎస్పీ ఫేజ్ లో అవసరమయ్యే ఆయకట్టుకు ఖరీఫ్, రబీ పంటకు నీరు అందించి రైతులను అదుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.