16-08-2025 09:42:16 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రభావిత ప్రాంతాలను మంచిర్యాల డీసీపీ శనివారం పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. మంచిర్యాలలోని రాళ్లవాగుతో పాటు లక్షెట్టిపేట్ పరిధిలోని గంపలపల్లి, కొమ్ముగూడెం గ్రామాలను, గోదావరి నది పరివాహక ప్రాంతాలను, చెరువులు, వాగులు, వంతెనలు, ప్రధాన రహదారులను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100
వర్షాలు భారీగా కురుస్తుండటంతో అత్యవసర సహాయం కోసం ప్రజలు 100 నంబర్‌కు డయల్ చేసి సహాయం పొందవచ్చునని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వర్షాల ప్రభావం, వరద పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, వివిధ గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలు నీట మునిగే ప్రమాదమున్నందున, వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు, వాగులు, కాలువలు, కుంటలు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. డీసీపీ వెంట మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్ రావు, లక్షేట్టిపేట సిఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్ తదితరులున్నారు.