16-08-2025 09:27:07 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. మున్నేర నది పరివాహక ప్రాంతాల ముందస్తు జాగ్రత్తల కోసం శనివారం ఖమ్మం నగరంలోని కాల్వొఒడ్డు, మున్నేరు ఘూట్, గణేష్ నిమర్జన ఘూట్, మంచికంటినగర్, బొక్కలగడ్డ, ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్, కేబీఆర్ నగర్, గ్రీన్ కాకతీయనగర్ తదితర ప్రాంతాలలో మున్సిపల్ కమీషన్ అభిషేక్ ఆగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ పర్యటించారు.
మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని, నీటి క్రమమట్టం లెవల్ లను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్నేరు పరిసర ప్రాంతాలు బొక్కలగడ్డ, మంచికంటి నగర్ ఇంటింటికి తిరుగుతూ స్ధానిక ప్రజలతో కలెక్టర్ ముచ్చటిస్తూ ఎగువ జిల్లాల నుండి మున్నేరు వరద పెరుగుతున్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని, అధికారులకు సహాకరించాలని, వరద ఎప్పటికప్పుడు గమనించుకోవాలని సూచించారు. మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధిత విభాగాలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.