calender_icon.png 16 August, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొర్రూరులో రేణుక ఎల్లమ్మ ధ్వజస్తంభ ప్రతిష్టాపన

16-08-2025 09:25:06 PM

తుర్కయంజాల్‌: తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ(Turkayamjal Municipality) పరిధి తొర్రూరులో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రోజు ప్రారంభమైన కార్యక్రమాలు ఈనెల 19తో ముగియనున్నాయి. ఆదివారం రోజు యాగశాల ప్రదక్షిణ, మంటప దేవత ప్రాతఃకాల పూజలు, జపములు, హోమములు, నివేదన హారతి, సాయంత్రం 6 గంటలకు ప్రదోషకాల పూజలు, నివేదన హారతి నిర్వహించనున్నారు. 18వ తేదీన సింహ లగ్నములో యంత్ర ప్రతిష్ట నాభిశిలా ప్రతిష్ఠాపన మహోత్సవం జరపనున్నారు. కుంభ నివేదన, పూర్ణాహుతి, అమ్మవారి ఊరేగింపు, బొడ్రాయి బోనాలు నిర్వహించనున్నారు. 19వ తేదీన అమ్మవారికి బోనాలు తీసి నివేదించనున్నారు.

శనివారం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌ రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మల్‌ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ భక్తుల కొంగుబంగారమైన రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాంరెడ్డి తెలిపారు.