calender_icon.png 16 August, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టులకు జల కళ

14-08-2025 01:13:03 AM

- భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు

- శ్రీశైలం 9 గేట్లను ఎత్తిన అధికారులు

- నిండుకుండలా మారిన సాగర్

- 26 గేట్లు ఎత్తి, దిగువకు నీటి విడుదల

- కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ వద్ద బాహుబలి పంపుల నుంచి నీటి విడుదల

నాగర్‌కర్నూల్, ఆగస్టు 13 (విజయక్రాంతి)/నాగార్జునసాగర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో బుధవారం అధికారులు తొమ్మిది గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 885 ఫీట్లు 215 టీఎంసీల సామర్థ్యం గల ప్రస్తుత శ్రీశైలం ప్రాజెక్టులో 202.050 టీఎంసిల నీటి నిల్వతో 882.70 ఫీట్ల మేర నీటి నిల్వ కొనసాగుతోంది.

ఎగువ నుంచి 1,37,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 1,89133 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్‌కు చేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,28,601 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 2,73,117 క్యూసెక్కులుగా ఉంది. ఇక, డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరుకుంది.

కడెం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద

నిర్మల్/మంచిర్యాల(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు బుధవారం వరద పోటెత్తింది. కడెం నది పరివాహక ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, బోత్, బజార్‌హత్నూర్ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురవడంతో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి 40,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు గాను 695 అడుగుల నీటి సామర్థ్యాన్ని నిలువ ఉంచుతూ వచ్చిన నీటిని వచ్చినట్టు మూడు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీరు వదులుతున్నట్టు తెలిపారు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి 

మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట వద్ద గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు లెవెల్ 148 మీటర్లు కాగా 145.48 మీటర్లకు వరద నీరు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ఇప్పటివరకు 13.7124 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు ఉపరితలం నుంచి 16027 క్యూబిక్ మీటర్ల వరద నీరు వస్తుండగా ఇందులో కడం ప్రాజెక్టు నుంచి 11,374 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.

బాహుబలి మోటార్లు ఆన్ 

కరీంనగర్(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి బుధవారం నీటి విడుదల ప్రారంభమైంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లిలోకి ప్రవహిస్తుండటంతో అక్కడి నుంచి నేరుగా నంది పంప్ హౌస్‌కు నీరు చేరుతుంది.

అక్కడ నుంచి గాయత్రి పంప్ హౌస్‌కు నీరు తరలి రావడంతో మిడ్ మానేరుకు తరలించాలని నిర్ణయించారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు మూడు మోటర్లను ఆన్ చేసి 9,450 క్యూసెక్కుల నీటిని ఎస్సార్ డ్యాం(మిడ్ మానేరు)  తరలించారు. ఈ ప్రక్రియ వారం రోజులపాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.