calender_icon.png 11 January, 2026 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా విక్రయ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

09-01-2026 12:00:00 AM

 జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి, జనవరి 8 (విజయక్రాంతి)  : యూరియా విక్రయ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  గురువారం జిల్లా కలెక్టర్ కొత్తకోట మండల పరిధిలోని పామాపురం, అప్పరాల ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం సందర్శించి యూరియా విక్రయ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా పంపిణీ చేసే ప్రతి విక్రయ కేంద్రం వద్ద అక్కడికి వచ్చే రైతుల కోసం షామియానాతో పాటు కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా యూరియా కొనుగోలు కోసం వచ్చే రైతులను ఎక్కువ సేపు వేచి ఉంచనీయకుండా త్వరగా వారికి కావాల్సిన యూరియా ఇచ్చి పంపే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. 

బస్తీ దవాఖాన భవనాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలి

కొత్తకోట మండల కేంద్రంలో ఆత్మకూర్ రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న బస్తీ దవాఖాన భవన నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న బస్తీ దవాఖాన భవనాన్ని పనులు వారం రోజుల్లోగా  వేగంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసి భవనాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి దామోదర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.