06-10-2025 04:52:38 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్(MLA Dr. Kalvakuntla Sanjay) అన్నారు. సోమవారం మెట్ పల్లి పట్టణంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వమే మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి క్వింటలుకు 2800 ఇచ్చి మొక్కజొన్న కొనుగోలు చేయాలి. అలాగే రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల కష్టాలను తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు 1800 లకు కూడా కొనడం లేదు, దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రైవేట్ వ్యాపారులు 2000 లకు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1800 కూడా కొనడం లేదు అని తెలిపారు. ప్రైవేట్ వ్యాపారులు ధర ఇంకా తగ్గించి 1600 లకు కొనే పరిస్థితి వస్తుందని తెలిపారు.
వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిలువ చేసుకునే పరిస్థితి లేక తడిచిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు పంటను దిక్కులేక దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందని, దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పటు చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం 2800 లకు మొక్క జొన్న పంట కొనాలి అన్నారు. ప్రభుత్వంకు రైతులు అంటే లెక్కలేని తనం వళ్ళ ఇవాళ మక్క పండించే రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడదీసి BRS పార్టీ పక్షాన ప్రభుత్వం పై పోరాడాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు ఎల్లాల దశరథ్ రెడ్డి, కోరుట్ల మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, నోముల లక్ష్మారెడ్డి, సిరిపూర్ పిఎసిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, జెడి సుమన్, ఎల్లేటి చిన్నారెడ్డి, భాస్కర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజా గౌడ్, జగన తదితరులు పాల్గొన్నారు.