calender_icon.png 12 November, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిర్చి సాగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి

12-11-2025 08:04:28 PM

జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని లావణ్య

వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): మిర్చి సాగు పట్ల రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని లావణ్య, మండల వ్యవసాయ అధికారి నవీన్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని పాత్ర పురం గ్రామ సమీపంలోని మిరప తోటలో వారు క్షేత్ర ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రైతులతో వారు మాట్లాడుతూ  వాతావరణ మార్పుల వల్ల వచ్చేటువంటి తెగుళ్లు, చీడ పీడల నివారణ చర్యలు, జాగ్రత్తల గురించి రైతులకు తెలిపారు. ప్రస్తుత తరుణంలో మిరప తోటలకు అధికంగా ఆకుమచ్చ తెగులు వస్తోందన్నారు.

తేమతో కూడిన వాతావరణం, అధిక వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ తెగులు సోకితే ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొన్ని రోజులకు ఆకులు పండుబారి రాలిపోతాయని అన్నారు. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా. + 1 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ లేదా 2 గ్రా. పోషామైసిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు. తామర పురుగులు వచ్చినట్లయితే రెక్కల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయని వివరించారు. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుందన్నారు.

దీని నివారణకు ఎకరానికి 300 గ్రాములు ఎసిఫేట్‌ లేదా 400 మిల్లీ లీటర్లు ఫిప్రోనిల్‌ లేదా స్పైనోశాడ్‌ 75 మిల్లీ లీటర్లు ఆకులు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాలని తెలిపారు. కింది ముడుత (తెల్లనల్లి) వచ్చినట్లయితే తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనబడుతాయని ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయన్నారు. దీని కారణంగా మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దకడుతాయని వివరించారు.

దీని నివారణకు ఎకరానికి డైకోఫాల్‌ ఒక లీటరు లేదా నీళ్లతో కరిగే గంధకం 600 గ్రాములు పిచికారీ చేయాలన్నారు. సింథటిక్‌ పైరిత్రాయిడ్‌ మందులు వాడకూడదన్నారు. నత్రజని ఎరువులను తగ్గించాలని, పైముడుత, కింది ముడుత ఉధృతి ఒకేసారి గమనిస్తే ఉధృతిని బట్టి ఎరానికి జోలోన్‌ 400మి.లీ. లేదా పెగాసెస్‌ 300 గ్రాములు లేదా క్లోరిఫెనాఫైర్‌ 400 మి.లీ. పిచికారీ చేసుకోవాలని తెలిపారు. పేను బంక నివారణకు పేనుబంక లేత కొమ్మలు, ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుందని తెలిపారు.

తీయ్యటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుందని అన్నారు. ఆకులు, కాయలు నల్లటి మసిపూసినట్లుగా మారిపోతాయని, నివారణకు ఎకరానికి మిథైల్‌డెమటాన్‌ 400 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్‌ 300 గ్రాములు చేయాలని వివరించారు.. పిల్ల పురుగులు, మొగ్గలు, పూత, పిందెలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు. సరైన సమయంలో దీన్ని కనిపెట్టి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నవీన్, ఉద్యాన అధికారి లావణ్య , రైతులు ధనరాజ్, వినోద్ పాల్గొన్నారు.