calender_icon.png 15 December, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

15-12-2025 07:30:18 PM

అదనపు కలెక్టర్ రెవిన్యూ ఖీమ్య నాయక్..

వనపర్తి (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులకు, కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మొదటగా పెబ్బేరు మండలం, అయ్యవారిపల్లి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యంలో తేమ తక్కువగా ఉన్న వెంటనే ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లుకు వెంటనే తరలించాలని, అలాగే దీనికి సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని కేంద్రం ఇన్‌ఛార్జ్‌ను ఆదేశించారు.

అనంతరం, వీపనగండ్ల ఏఎంసీ(AMC) గోదామును తనిఖీ చేశారు. ఇప్పటికే నిల్వ చేసిన ధాన్యాన్ని పరిశీలించి, ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే మిల్లులకు తరలించాలని అధికారులకు స్పష్టం చేశారు. తరువాత, చిన్నంబావి మండలం, పెద్దదగడ, వెల్గొండ ఐకేపీ కేంద్రాలకు సందర్శించి కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించారు. ఎటువంటి ఆలస్యం లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎక్కువ మంది కూలీలను నియమించాలని సంబంధిత ఏపీఎం(APM), కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లను ఆదేశించారు. రైతులు కూడా ధాన్యాన్ని శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. సివిల్ సప్లై డిఎం జగన్ మోహన్, ఇతర అధికారులు తదితరులు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు.