08-05-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, మే 7 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలులోకి తెచ్చిన భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలోని దంతాలపల్లి మండలాన్ని భూభారతి నూతన చట్టం అమలు కోసం పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ మండలంలో నిర్వహిస్తున్న గ్రామ రెవిన్యూ సదస్సులను బుధవారం కలెక్టర్ సందర్శించారు.
రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నమోదు చేసి వారికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులకు పంపి, క్షేత్రస్థాయిలో నిబంధనల ప్రకారం సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మరిపెడ, దంతాలపల్లి, నరసింహులపేట, చిన్న గూడూరు మండలాల్లోని అబ్బాయి పాలెం, ఎల్లంపేట, రామవరం, వేములపల్లి, వంతడుపుల, ఉగ్గంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
కాంటాలు త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన హమాలీ, కూలీలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ గణేష్, డిసిఓ వెంకటేశ్వర్లు, తహసిల్దార్లు సైదులు, సునీల్ రెడ్డి ఉన్నారు.