14-05-2025 01:20:29 AM
‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్‌తో రష్యాను కోరిన భారత్
న్యూఢిల్లీ, మే 13: ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంలో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను గాలిలోనే అడ్డుకుని సత్తాచాటిన ఎస్-400 వ్యవస్థకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం ప్రపంచదేశాలు రష్యాను సంప్రదిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ విజయంలో కీలకపాత్ర పోషిం చిన ఎస్-400 సిస్టమ్స్ మరిన్ని కావాలని భా రత్ అధికారికంగా రష్యాను సంప్రదించిందని ఉన్నతస్థాయి రక్షణ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. భారత్‌కు మరిన్ని ఎస్- 400సిస్టమ్స్‌ను ఇచ్చేందుకు రష్యా ఆమోదించే అవకాశం ఉందని సదరు వర్గాలు తెలిపాయి.
ఎస్-400 వ్యవస్థ ప్రత్యేకతలు ఇవి..
రష్యాలో తయారుచేయబడిన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్‌లో ‘సుదర్శన్ చక్ర’ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతమైనవి. ఇవి 600 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ట్రాక్ చేయగలవు. 400 కి.మీ. వరకు ఉన్న పరిధుల్లో వాటిని అడ్డగించగలవు. నాలుగు రకాల క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన ఎస్-400 విమానం, డ్రోన్‌లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగలదు. దీనిలోని అధునాతన రాడార్ ఒకేసారి 100లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది.
2018లో రష్యాతో ఒప్పందం..
భారతదేశం 2018లో రష్యాతో ఐదు ఎస్-400వ్యవస్థల కోసం 5.43 బిలియన్ యూఎస్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్థాన్, చైనా నుంచి వైమానిక ముప్పులను ఎదుర్కొవడానికి 2021లో పంజాబ్‌లో మొదటిదాన్ని మోహరించింది.