calender_icon.png 22 August, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేజీ ర్యాంకింగ్‌ను బట్టే ఫీజులు ఖరారు

22-08-2025 02:19:40 AM

  1. విద్యాప్రమాణాలు పాటిస్తేనే ఫీజులు పెంపు!

ఫీజులు పెంచాలంటే అన్ని ఉండాల్సిందే

ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల నిర్ధారణకు ప్రభుత్వం మార్గదర్శకాలు  

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): నాణ్యమైన విద్యాప్రమాణాలు పాటించే ఇంజినీరింగ్ కాలేజీల్లోనే ఫీజు పెంచుకునే ఛాన్స్ ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గురువారం ఇంజినీరింగ్ సహా ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజు నిర్ధారణ నిబంధనలకు సవరణలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. బోధనాప్రమాణాలు, పరిశోధనలు, న్యాక్ గ్రేడింగ్, తదితర నిబంధనల అమలు ఆధారంగానే ఫీజు పెంపునకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కళాశాలలు అందించే వివరాలు, ఆడిట్ రిపోర్టులతో పాటు ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని ఫీజులు నిర్ధరించాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాల ల్లో విద్యార్థుల హాజరు, ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ పక్కాగా అమలు, ఆధార్ ఆధారిత ఫీజుల చెల్లింపులు సహా విద్యార్థులను పరిశోధనలవైపు ప్రోత్సహిస్తున్నారా లేదా? అనే అంశాల్ని పరిగణలోకి తీసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కేవలం ఆయా కాలేజీలు టీఏఎఫ్‌ఆర్‌సీకు అందించే నివేదిక ప్రకారంగా ఫీజులను ఇకమీదట పెంచే వీలుందడు. కాలేజీలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయా? ఆ కాలేజిల్లో విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? అనే అంశాలపైనా దృష్టి సారించనుంది. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు, ప్రభు త్వ నిబంధనలను ఏ మేరకు అమలు చేస్తున్నారనే అంశాలను పరిశీలించిన తర్వాతే కళాశాలల్లో ఫీజులను నిర్ధారించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

2025 వరకు టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజులు భారీగా పెరిగాయని భావించిన ప్రభుత్వం..ఫీజుల అంశాన్ని తేల్చేందుకు ఉన్నతస్థాయి కమిటీని గతంలో వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి బుధవారం సమర్పించడంతో ఫీజు ల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలను తాజాగా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ ఫీజుల అంశం కోర్టులో ఉండడంతో మరోసారి కాలేజీలతో నూతన మార్గదర్శకాల ప్రకారం అధికారులు సంప్రదింపులు జరిపి ఫీజులను తేల్చనున్నారు. అయితే అప్పటివరకు పాత ఫీజులే అమల్లోకి ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.