20-12-2025 08:47:01 PM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు,(విజయక్రాంతి): గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక బాధ్యతని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల పరిధిలోని సారపాక పుష్కర వనంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. మండలంలోని 18 గ్రామపంచాయతీలో 13 పంచాయతీల కాంగ్రెస్, మిత్ర పక్షాల అభ్యర్థులను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఐదు పంచాయతీలు ఏకగ్రీవం కావడం సంతోషంగా ఉందన్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు అదనపు నిధులు వచ్చేలా కృషి చేస్తానని, గెలిచిన ప్రతి పంచాయతీకి నిధులు ఇచ్చే బాధ్యత నాదని అన్నారు. ప్రజలు మనపై విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారని, పార్టీలను పక్కన పెట్టి, అందరిని కలుపుకొని పోవాలని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి అని సూచించారు. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఎమ్మెల్యే చెప్పారు. మీకు అందరికి నేను అండగా ఉంటూ మీ గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని భరోసా ఇచ్చారు.
పార్టీ తరఫున పోరాడి ఓడిన వారికి అండగా ఉంటానని, ఎన్నికల్లో ద్రోహం చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐదు పంచాయతీల్లో నాయకత్వ లోపం వలనే ఓటమి పాలయ్యమని, పార్టీలో సీనియర్ , జూనియర్ అనేది లేదని అందరూ ఒకటేనని స్పష్టం చేశారు. అందరు కలిసి పార్టీ అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. త్వరలో మండలంలో కొత్త నాయకత్వాలు వస్తాయని తెలిపారు. సర్పంచులుగా గెలిచారని వారికి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. జిల్లాలోనే 3012 అత్యధిక మెజారిటీతో ఓట్లతో గెలిచిన సారపాక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ ను ఆయన అభినందించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన శాలువాలు కప్పి సన్మానించారు. ఈ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్, ఐఎన్టీయూసీ నాయకులు మారం వెంకటేశ్వర్ రెడ్డి, రాంరాం పిచ్చిరెడ్డి,మాజీ జడ్పిటిసి విజయ్ గాంధీ, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, జిల్లా మహిళ కార్యదర్శి బోడ దివ్య,నాయకులు కైపు శ్రీనివాస్ రెడ్డి, చల్ల వెంకటనారాయణ,భజన ప్రసాద్, వరాల వేణు,సుధాకర్ రెడ్డి,యువత, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.