calender_icon.png 20 December, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

20-12-2025 08:49:48 PM

రాష్ట్ర రోడ్డు రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్డు రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, శాంతి భద్రతల డి. జి. పి. మహేష్ భగవత్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్. పి.లు, అదనపు కలెక్టర్లు, రవాణా, ఇంజనీరింగ్, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య, విద్య శాఖల అధికారులు, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రహదారి భద్రతా మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని, 2026వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రతి జిల్లాలో అన్ని శాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ప్రమాదం వలన మనిషి మరణం/ క్షతగాత్రులు అయితే కుటుంబం ఆర్థికంగా చిత్రమవుతుందని, ఇలాంటి అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రహదారి, ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా తెలియజేయాలని తెలిపారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రమాదం జరిగిన వెంటనే శతకాత్రులను సమీప ఆసుపత్రికి తరలించే విధంగా ప్రజలలో సామాజిక బాధ్యత పై చైతన్యం తీసుకురావాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్. పి. నితిక పంత్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, రవాణా, రహదారులు భవనాలు, మున్సిపల్ శాఖల అధికారులతో హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి భద్రతా మాసోత్సవాలను నెల రోజుల పాటు నిర్వహించేందుకు కార్యచరణ ప్రకారం చర్యలు తీసుకుంటామని, రహదారి నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాలను ప్రతి నెల నిర్వహించి అవసరమైన రక్షణ చర్యలు చేపడుతున్నామని, పాఠశాలలు, కళాశాలలలో రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆటో, ట్రాక్టర్, లారీ డ్రైవర్లకు సమావేశాలు నిర్వహించి తగు సూచనలు ఇస్తున్నామని ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాతీయ రహదారి ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులు ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో పాటు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో రహదారి భద్రత మాస ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.