25-07-2025 11:47:27 PM
ఎరువులు తీసుకున్న రైతుల వివరాలు నమోదు చేయాలి
అధికారులతో రివ్యూ మీటింగ్ లో సిద్దిపేట కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ముఖ్యంగా ఎరువుల లభ్యతపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి శుక్రవారం కీలక సమీక్ష నిర్వహించారు. హుస్నాబాద్ లోని ఐవోసీలో ఆర్డీవో రామ్మూర్తి, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలోకలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వానకాలం సీజన్ కావడంతో ఎరువుల లభ్యత, పంపిణీపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. "ఎరువుల షాపుల్లో స్టాక్ రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి. ఎరువులు తీసుకున్న రైతుల వివరాలు, వారి భూమి విస్తీర్ణం వారీగా రిజిస్టర్‌లో నమోదు చేయాలి," అని ఏవోలకు సూచించారు.
ఈ నెలలో 3140 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని, 850 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయని తెలిపారు. ఆగస్టులో 3250 మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని అంచనా వేసి, దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఏఈవోలను ఆదేశించారు. అన్ని అభివృద్ధి పనులను డెడ్‌లైన్‌లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ కింద సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, హెల్త్ సబ్ సెంటర్లు, అంగన్‌వాడీ టాయిలెట్స్, ప్రహరీల నిర్మాణం తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి నాలుగు వరుసల రోడ్డు పనులు, హుస్నాబాద్ మున్సిపాలిటీలోని సీసీ రోడ్లు, వివిధ కమ్యూనిటీ హాళ్లు, ఎల్లమ్మ చెరువుకట్ట సుందరీకరణ పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
150 పడకల ఆసుపత్రి పనులను టీజీఎంఎస్ఐడీసీ అధికారులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ కాని వాటిపై దృష్టి సారించి, లబ్ధిదారుల అంగీకారంతో పేర్లు తొలగించి అర్హులకు కేటాయించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా ప్లాంటేషన్ లక్ష్యాలను పూర్తి చేయాలని, ప్రభుత్వ భూముల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పీహెచ్‌సీలు అప్రమత్తంగా ఉండాలని, శానిటేషన్ డ్రైవ్, బ్లీచింగ్ స్ప్రే చేయాలని అధికారులను ఆదేశించారు. వేడి చేసిన నీటిని మాత్రమే తాగేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.