26-07-2025 12:00:00 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, జూలై 25 :(విజయ క్రాంతి): జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గిడ్డంగిలో రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలుకరించి, సరిపడా ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. జిల్లాలో ఇంకనూ 11 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రెండు రోజులకు ఒకసారి ఎరువుల స్టాక్ జిల్లాకు వస్తోందని కలెక్టర్ తెలిపారు.
అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఎరువుల కొరత తలెత్తకుండా పర్యవేక్షణ చేస్తున్నామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రైతులు కూడా తమకు పూర్తి స్థాయిలో ఎరువులు లభిస్తున్నాయని, ఎలాంటి కొరత లేదని సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అధిక లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు వైపు దృష్టి సారించాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.