calender_icon.png 23 August, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

23-08-2025 03:15:57 PM

విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు..

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. 

కరీంనగర్ (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) కోరారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ పండుగ నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, మున్సిపల్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో నగరంలో లో-లెవెల్ లో ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనానికి వెళ్లే రూట్లలో విద్యుత్ తీగల విషయంలో ఆ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రూట్ క్లియరెన్స్ సమర్పించాలని అన్నారు. వేడుకల కోసం లైటింగ్, శానిటేషన్, బ్లీచింగ్ వంటి పనులను మున్సిపల్ ఆధ్వర్యంలో పక్కాగా చేపట్టాలని ఆదేశించారు.

నిమజ్జన ప్రాంతాల్లో వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో షిఫ్ట్ ల వారీగా ఈతగాళ్లను, బోట్ లను ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక, మైనింగ్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబి పండుగలకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వినాయక నిమజ్జనం రోజున సాధ్యమైనంత త్వరగా విగ్రహాలను నిమజ్జన ఉత్సవానికి తరలించాలని కోరారు. విగ్రహాలను నిమజ్జనానికి తరలించే రూట్లలో పూర్తిస్థాయి మరమ్మతులు చేయాలని అధికారులను కోరారు. ముఖ్యంగా మునిసిపల్, ఎలక్ట్రిసిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఆ శాఖల సిబ్బందిని షిఫ్టుల వారీగా విధుల్లో ఉంచాలని అన్నారు.

గతంలో మాదిరిగానే ఈసారి కూడా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఉంటుందని, మిలాన్ ఉల్ నబి వేడుకలకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఈసారి నగరంలో సుమారు 3300 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. నిర్వాహకులు పోలీస్ వెబ్సైట్లో గణేష్ మండపం పూర్తి వివరాలు నమోదు చేయాలని, తద్వారా వారికి తగిన సేవలు అందుతాయని తెలిపారు. నిమజ్జన ప్రాంతాలైన మనకొండూర్, కొత్తపల్లి, చింతకుంట చెరువుల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, డ్రైవర్లు, మెకానిక్, గజ ఈతగాళ్లను  సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో మండపాల నిర్వాహకులు అందుబాటులో ఉండాలని సూచించారు. పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొని అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.