23-08-2025 07:26:51 PM
కాసిపేట, బెల్లంపల్లి రైతుల్లో కలవరం..
తాజాగా మాదారం అడవుల్లో..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి(Bellampalle) పరిసర ప్రాంత ప్రజలను మళ్లీ పులి భయం వెంటాడుతుంది. తాజాగా శనివారం తాండూర్ మండలంలోని మాదారం అడవుల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఏడు నెలల కిందట ఇదే ప్రాంతంలో పెద్దపులి సంచరించి భయపెట్టింది. కాసిపేట మండలంలోని దేవాపూర్ ప్రాంతంలో కార్మికుల కంటపడిన పెద్దపులి అక్కడి నుండి కన్నాల(బుగ్గ) అడవుల్లో అడవి పందులను వేటాడుతూ నెల రోజుల వరకు మకాం వేసింది. అడపాదడపా బెల్లంపల్లి మండలంలోని కన్నాల అడవుల మీదుగా కాసిపేట మండలం పెద్దనపల్లి పరిసరాల్లో సంచరిస్తూ తిరిగి బుగ్గ అటవీ ప్రాంతంలోని తిష్ట వేసింది. నెల రోజుల వరకు అటవీ అధికారులతో పాటు కాసిపేట, బెల్లంపల్లి మండలాల రైతులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. గత ఫిబ్రవరి 10న బెల్లంపల్లి బుగ్గ అడవులను వీడి తాండూర్ మండలం మాదారం అడవుల్లోకి వెళ్లిపోయింది.
తాండూరు మండలంలోని రేపల్లె వాడ, పెగడపల్లి ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన పాదముద్రలను అటవీ అధికారులు సేకరించారు. అయితే బుగ్గ అడవుల మీదుగా అంకుశం గుట్టలను దాటుకుంటూ మాదారం బీట్ కు చేరుకున్న పెద్దపులి తిర్యాణి అడవుల్లోకి వెళ్లిందా? రేపల్లె వాడ మీదుగా రెబ్బెన మండలం పులికుంట వైపుకు వెళ్లిందా అనే అనుమానాలను అటవీ అధికారులు స్పష్టం చేయలేదు. ఇదే క్రమంలో బెల్లంపల్లి మండలంలోని దుగినేపల్లి పరిసరాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించడంతో నెన్నెల మండలంలోని కుష్ణపల్లి రేంజ్ లోకి వెళ్ళి పోయిందని అటవీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో బెల్లంపల్లి బుగ్గ అడవుల్లో సంచరించిన పులి ఇదే అయి ఉంటుందని అధికారులు భావించారు.నెన్నల అడవులను చేరుకున్న పెద్ద పులి చిత్తాపూర్ ఆవిడ ప్రాంతాల్లో సంచరించింది. భీమారం అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన గేదెపై దాడి చేసి హతమార్చింది.
పెద్దపులి కదలిక లు బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో కనిపించకపోవడంతో చెన్నూర్ వైపు వెళ్లిపోయిందని భావించి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏడు నెలలుగా ప్రశాంతంగా ఉన్న కాసిపేట, బెల్లంపల్లి మండలాల అడవుల్లో తిరిగి పెద్దపులి కలవరం మొదలైంది. ఈ రెండు మండలాల్లో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పశువుల కాపరులు పశువులను అడవుల్లోకి మేతకు తీసుకువెళ్లేందుకు భయపడిపోతున్నారు. ఇటీవల కాసిపేట మండలంలోని ధర్మారావుపేట సెక్షన్ పరిధిలో గల వెంకటాపూర్ బీట్ రొట్టెపల్లి అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందపై పెద్దపులి దాడి చేసి ఒక లేగ దూడను హతమార్చడం ఆందోళన రేకెత్తించింది. రెండు రోజుల కిందట దేవాపూర్ రేంజ్ పరిధిలో ఆవుపై దాడి చేసి చంపింది. దీంతో గతంలో బెల్లంపల్లి బుగ్గ అడవుల్లో సంచరించిన పెద్దపులి మాదారం అడవుల నుండి రొట్టెపల్లి అటవీ ప్రాంతంలో వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల కిందట బుగ్గ దేవాలయం పరిసరాల్లోని కరిశెలఘట్టం గ్రామం వరకు వచ్చి మేకల మంద పై దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అటవీ అధికారుల నుండి మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
తిర్యాణి అడవుల మీదుగా రాకపోకలు
కాసిపేట మండలం రొట్టెపల్లి అడవుల్లో సంచరించిన పెద్దపల్లి వారం రోజుల క్రితమే తిర్యాణి అడవుల్లోకి వెల్లి అక్కడి రొంపెల్లి ప్రాంతం మీదుగా తాండూర్, కాసిపేట వైపు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. అటవీ గ్రామాల ప్రజలను, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. అటవీ గ్రామాల ప్రజలు పంట పొలాలకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కాకుండా పశువులను గ్రామాల పరిసరాలలో మేపాలని సూచిస్తున్నారు. కరిశెలఘట్టం ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు ఎలాంటి లేవని అటవీ అధికారులు చెబుతున్నారు. తాజాగా శనివారం మాదారం అడవుల్లో పులి సంచరిస్తున్న విషయం హడలెత్తిస్తోంది.