17-11-2025 08:06:33 PM
చేగుంట: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామ రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రైతు సంయుక్త బృందం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన విత్తనాలను అభివృద్ధి చేసే క్రమంలో వరి పంట ఆశించినంత దిగుబడి లేదు అని చేసిన ఫిర్యాదు మేరకు, జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, తెలంగాణ విత్తనాలు అభివృద్ధి సంస్థ తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ ఆధ్వర్యంలో కమిటీగా రూపొందించి, ఈ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది.
ఈ గ్రామ శివారులో వివిధ రైతులకు సంబంధించిన వరి పంటను పరిశీలించడం జరిగింది, పంట వివిధ దశలో ఆశించిన చీడపీడలు, పంట యొక్క పెరుగుదల వరిలో వచ్చే పిలకలు సంఖ్య, పంట యొక్క అభివృద్ధిలో కీలక దశలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కే. రాహుల్ విశ్వకర్మ, డా. ఎ. నిర్మల, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్. విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్, తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సహాయ సంచాలకులు ఎం. శివకుమార్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ అతుల్ కుమార్ జైన్, వ్యవసాయ అధికారి రాజనారాయణ, వ్యవసాయ టెక్నికల్ అధికారి వందన, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.