పీసీసీ పీఠానికి తీవ్ర పోటీ
- మహేష్‌కుమార్ గౌడ్ వర్సెస్ సంపత్‌కుమార్
- బీసీకి అవకాశమిస్తే మహేష్‌కుమార్‌గౌడ్
- ఎస్సీ నుంచి సంపత్‌కుమార్ పరిశీలన
- ఏఐసీసీ పెద్దలతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ
- మూడు రోజులుగా ఢిల్లీలోనే మంతనాలు
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరింది. నూతన అధ్యక్షుడిని జూలై మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పదవి కోసం ఐదారుగురు పేర్లు వినిపించినప్పటికి.. చివరకు ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నట్లుగా తెలిసింది. బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. గత మూడు రోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీలోనే ఉన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు సైతం అక్కడే ఉన్నారు. నూతన పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో గురువారం రాత్రి సమావేశమై చర్చించారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సీఎం, భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కొత్త అధ్యక్షుడి నియామకం తొందరగా చేపట్టాలని కోరారు. మహేష్‌కుమార్‌గౌడ్, సంపత్‌కుమార్ పార్టీలో ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పని చేయడంతో పాటు ఇప్పుడు పార్టీలో కీలకంగానే ఉన్నారు. సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఉండటంతో పీసీసీ పదవి ఇతరులకు ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉంది.
డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క (ఎస్సీ మాల) ఉండగా, మాదిగ సామాజిక వర్గానికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో బలమైన సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకి కొంత దూరమైందని, పీసీసీ పదవి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్‌కు అప్పగిస్తే మాదిగలు పార్టీకి మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని ఢిల్లీ పెద్దల ముందు కొందరు ముఖ్య నాయకులు తమ వాదన వినిపిస్తున్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ బీసీ సామాజిక వర్గానికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను కూడా బీసీలకు ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు. ఈ విషయంలో ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది.




