18-01-2026 12:00:00 AM
సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉదృత పోరాటం
సనత్‌నగర్, జనవరి 17 (విజయక్రాంతి): సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలు చేతబూని, మెడలో నల్ల కండువాలు వేసుకొని మోండా మార్కెట్ నుండి బాటా, జనరల్ బజార్ మీదుగా ఎంజీ రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు చేరుకొని అక్కడ కొద్దిసేపు బైఠాయించారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు మీ ర్యాలీకి అనుమతి లేదంటూ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తో పాటు మిగిలిన వారిని అరెస్ట్ చేసి రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పోలీసు స్టేషన్‌లో నినాదాలు చేశారు. కాగా శుక్రవారం రాత్రి తమ ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ రోజు చేపట్టిన ర్యాలీకి హాజరై మద్దతు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మోండా డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, నాగులు, కె.కిషోర్ కుమార్, కొండాపురం మహేష్ యాదవ్, ఆరీఫ్, నాగలక్ష్మి, అమర్, జగదీష్, సత్యనారాయణ, మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, లోకనాధం తదితరులు ఉన్నారు.