13-08-2024 12:49:48 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): గత దశాబ్దకాలంలో అమలు చేసిన పటిష్ఠమైన ఆర్థిక విధానాలను కొనసాగిస్తే భారత్ 2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని భారత ప్రభుత్వ మాజీ ఎకనామిక్ చీఫ్ అడ్వైజర్, ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐఎస్‌బీ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేశారు. సోమవారం ఐఎస్‌బీ హైదరాబాద్ క్యాంపస్‌లో తన ఇండియా@100 ఎన్‌విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్‌హౌస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏటా 8 శాతం వృద్ధి రేటును సాధించినట్లయితే 55 ట్రిలియన్లు సాధ్యమేనని వివరించారు.
కాగా, 2047 నాటికి భారత్ 26 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ యంగ్ అంచనా వేయగా.. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాక్స్ 2075 నాటికి 50 ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందని చెప్పింది. వీటికి విరుద్ధంగా కృష్ణమూర్తి చెప్పడం గమనార్హం. అయితే తాను భారత్‌లో నివసించడం ద్వారా ఇక్కడి వాస్తవ పరిస్థితులు తనకు పూర్తిగా తెలుసునని, దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన, దశాబ్దాల విద్యా పరిశోధనల ఫలితంగా వచ్చిన జ్ఞానంతో, ప్రపంచ పరిస్థితిని అర్థం చేసుకొని ఈ అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు.
ఈ నాలుగు అంశాలే పిల్లర్లు..
రాబోయే రెండు దశాబ్దాల్లో స్థూల ఆర్థిక వృద్ధిపై ఫోకస్, మధ్యతరగతి సమ్మిళిత వృద్ధి, నైతిక సంపద సృష్టి, ప్రైవేటు పెట్టుబడి చక్రం.. 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఇవే కీలకమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నాలుగో అంశంపై ప్రత్యేకంగా వివరించారు. ప్రైవేటు పెట్టుబడిదారులు సంపదను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తారని, వారి సంపదను తిరిగి పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఉద్యోగాలు, ఉత్పత్తి పెరిగి వృద్ధి సాధిస్తుందన్నారు. గత రెండు దశాబ్దాలు చైనా ఏటా 8 శాతం వృద్ధి రేటును సాధించిందని గుర్తు చేశారు. కృష్ణమూర్తి భారత ప్రభుత్వానికి 17వ ముఖ్య ఆర్థిక సలహాదారు (2018 గా పనిచేశారు. కరోనా సమయంలో ఆయన ఇచ్చిన సూచనలు కేంద్రానికి చాలా ఉపయోగపడ్డాయని చెబుతుంటారు.